
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పూసిగూడ పంప్‌హౌస్ పరిశీలన
నార్నూర్, డిసెంబర్ 15 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని పూసిగూడ పంప్‌హౌస్‌ను బుధవారం పరిశీలించారు. మిషన్ భరగీథ ఆపరేటర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 58 గ్రామాలకు ఏడు లక్షల లీటర్ల నీరు రోజూ సరఫరా అవుతుందని తెలిపారు. గతంలో దాహార్తిని తీర్చుకునేందుకు ప్రజలు కిలో మీటర్ల దూరంలోని వ్యవసాయ బావులు, చెలిమల నుంచి నానా తంటాలు పడుతూ తాగునీటిని తీసుకొచ్చేవారని పేర్కొన్నారు. ఇప్పడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణనే అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నిత్యం శుద్ధ జలం అందించాలని ఆపరేటర్‌కు సూచించారు. ఈయన వెంట వైస్ ఎంపీపీ జాదవ్ చంద్ర శేఖర్, గంగపూర్ సర్పంచ్ యుర్వేత రూప్‌దేవ్, జీవవైవిద్య కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి ఉన్నారు. అనంతరం మండలంలోని రాజుల్‌గూడ గ్రామంలో నిర్వహించిన తెర్వీ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. పవార్ నారాయణ్ చిత్రపటానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి నారాయణ్ మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ రాథోడ్ సావిందర్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, జీవవైవిద్య కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి, జాదవ్ రెడ్డి నాయక్, రాథోడ్ దిగంబర్, గ్రామపెద్దలు ఉన్నారు.