
సంప్రదాయ పంటలకు స్వస్తి.. విదేశీ సాగువైపు మొగ్గు..
ఆన్లైన్లో వెతికి.. కొత్త పంట వేసి..
పంట కాలం తక్కువ.. ఆదాయం ఎక్కువ..
రెండెకరాల్లో సాగు.. పంటకు రూ.2 లక్షల లాభం..
సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు ఎగుమతి
స్థానికుల ఆసక్తి.. మార్కెట్లో మంచి డిమాండ్..
ఆరోగ్యానికి మేలు.. ఔషధగుణాలు మెండు..
జిల్లా అధికారుల సూచనలు తీసుకుంటూ సాగు
ఆదిలాబాద్ జిల్లా మరో కశ్మీరంలా పేరు పొందింది. శీతల వాతావరణం, సారవంతమైన నేలలు అధికంగా ఉండడంతో విభిన్న పంటలు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో సాగయ్యే డ్రాగన్ ప్రూట్ పంటలతోపాటు విదేశీయులు ఆహారంలో అధికంగా ఇష్టపడే బ్రకోలి కూడా సాగవుతున్నది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన న్యాయవాది రెండెకరాల్లో బ్రొకోలి(పచ్చగోబి) సాగు చేస్తున్నాడు. విదేశాలలో మంచి డిమాండ్ ఉండడంతో మొగ్గు చూపాడు. స్థానిక మార్కెట్లకు సరఫరా చేయడంతోపాటు సౌది అరేబియా, దుబాయ్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాడు. పంట కాలానికి అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు రూ. లక్ష చొప్పున లాభం పొందుతున్నాడు. ఔషధ గుణాలు అధికంగా ఉండడం, ఆరోగ్యానికి మేలు చేసేది కావడంతో స్థానికులు కూడా ఆసక్తి చూపుతున్నారు. బ్రొకోలిపై ప్రత్యేక కథనం..
పచ్చగోబిలో ఔషధ గుణాలు మెండు..
బ్రొకోలిలో విటమిన్ బీ-5,సీ,ఈ, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు న్యూట్రిషియన్స్ ఉంటాయి. ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ కారకాలతో పోరాడడంతోపాటు మతిమరుపును తగ్గిస్తుంది. చర్మకణాలను శుద్ధి చేస్తుంది. వృద్ధుల్లో ఎముకలు పెడుసుగా, బలహీనంగా మారే లక్షణాలను తగ్గిస్తుంది. ఇందులో క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలోపేతం చేయడంతోపాటు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా పొట్టను, పేగులను శుభ్రపరిచి, జీర్ణక్రియను పెంపొందిస్తుంది. కాగా.. రైతులు సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే బదులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఇలాంటి కూరగాయల పంటలు వేసి లాభం పొందవచ్చని ఉమర్ అక్తర్ తెలుపుతున్నాడు.
విదేశాలకు ఎగుమతి..
దేశ విదేశాలలో బ్రొకోలికి మంచి డిమాండ్ ఉంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వాహనాల ద్వారా అనంతరం సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు విమానాల ద్వారా ఎగుమతి చేస్తున్నాడు. గతేడాది ఎకరం భూమిలో సాగు చేయగా.. ఈ సంవత్సరం రెండెకరాల్లో వేశాడు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంచి డిమాండ్ ఉండడంతో స్థానిక కూరగాయల మార్కెట్, రైతుబజార్లలో విక్రయిస్తున్నాడు. కిలో రూ.100కు అమ్ముతున్నారు. స్థానికులు కూడా చూడడానికి విభిన్నంగా, రుచిగా ఉండడం, ఆరోగ్యానికి మేలు చేసేది కావడంతో ఆసక్తి చూపుతున్నారు. అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
రెండెకరాల్లో బ్రొకోలి సాగు.. ఎకరాకు రూ.2 లక్షల లాభం..
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామంలో బ్రొకోలి పంటను రెండెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఇది క్యాలీఫ్లవర్ జాతికి చెందినది. పచ్చని రంగులో ఉండడంతో స్థానికంగా పచ్చగొబిగా పిలుస్తారు. శీతల వాతావరణం, నల్లరేగడి పంటకు అనుకూలంగా ఉండడంతో మన వద్ద సాగు చేస్తున్నారు. నీటి తడులు కూడా తక్కువే అవసరం. పంట కాలం కూడా 80-90 రోజుల్లో చేతికి వస్తున్నది. పాలిహౌజ్లలో పండే పంటను రైతు అక్తర్ ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి సీడ్ తీసుకొస్తుండగా.. ఎకరాకు రూ.15 వేలు అవుతున్నాయి. తక్కువ సమయంలో పంట చేతికి వస్తుండడం, లాభాలు కూడా అధికంగా ఉండడంతో మొగ్గు చూపాడు. ఎకరా సాగుకు రూ.50 వేల ఖర్చు అవుతుండగా.. 10 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది. అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు దాదాపు లక్ష రూపాయలకు పైగా లాభం వస్తున్నది.
వకీల్ సాబ్ నయా ఎవుసం
వకీల్ సాబ్ ఉమర్ అక్తర్ బ్రకోలితోపాటు ఎలిఫెంట్ యామ్(కంద)ను కూడా పండిస్తున్నాడు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ప్రయోగాత్మకంగా తనకున్న మరో ఐదెకరాల్లో అంతర పంటగా వేశాడు. డ్రిప్ విధానం ద్వారా సాగు చేస్తుండగా.. ఎకరాకు దాదాపు రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతున్నది. పంట కాలం ఏడు నెలలు అయినప్పటికీ కందిలో అంతర పంటగా వేశాడు. ఎకరాకు సగటున పది టన్నుల వరకు దిగుబడి వస్తుండగా.. కిలోకు రూ.40-50 వరకు విక్రయిస్తున్నాడు.
అన్ని ఖర్చులు పోనూ రూ.లక్ష వరకు లాభం వస్తున్నదని తెలుపుతున్నాడు. మరో పక్షం రోజుల్లో పంట చేతికి వస్తుండగా.. దుబాయ్‌కు ఎగుమతి చేస్తానని తెలిపాడు.
ఔషధాల గడ్డ
ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తొలగించడంతోపాటు డయాబెటిస్ రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి, ఆడవారిలో టెస్టోస్టిరాన్ పెరుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేద మందులలో బాగా ఉపయోగిస్తారు. కంటిచూపును కూడా పెంచుతుంది.