
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో టెలీకాన్ఫరెన్స్
ఎదులాపురం, నవంబర్ 15 : పోడుభూములకు సంబంధించిన క్లెయిమ్ ఫారాలను స్వీకరించడంతో పాటు లోటుపాట్లు లేకుండా నివేదికలు సమర్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పోడుభూములు సాగు చేస్తున్న వారు క్లెయిమ్ ఫారాల్లో పూర్తి వివరాలను నమోదు చేయడంతో పాటు ఆధారాలకు సంబంధించిన, కులానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జతచేయించి తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 345 గ్రామపంచాయతీల పరిధిలోని 728 ఆవాసాల్లో పోడుభూములు సాగు చేస్తున్నట్లు నివేదికలు ఉన్నాయని, అదనంగా ఆదిమ ఆవాసాలు (పీవీటీజీ), సాగు చేస్తున్న పోడుభూములకు సంబంధించిన వివరాలను అదనపు షీట్లలో నమోదు చేసి సమర్పించాలన్నారు. నివేదికల్లో ఎలాంటి తప్పుల్లేకుండా నిర్ధిష్టమైన సమాచారంతో నిర్ణీత సమయంలోగా అందజేయాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ మాట్లాడుతూ.. 98 ఆదిమ ఆవాసాలు క్రోడీకరించాల్సి ఉందని, వాటికి ఆయా తహసీల్దార్లు నివేదికలు వెంటనే సమర్పించాలని, ఆయా ఆవాసాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. క్లెయిమ్ ఫారాల్లో నమోదు చేస్తున్న భూముల విస్తీర్ణం ఎకరాలు, గుంటల్లో స్పష్టంగా నమోదు చేయాలని, ఇప్పటివరకు సమర్పించిన నివేదికలను కూడా సరిచేసి పంపించాలని తెలిపారు. క్లెయిమ్ ఫారాల్లో సరైన క్రమంలో కుటుంబ వివరాలు, భార్య, కుల ధ్రువీకరణ పత్రాన్ని జతపరచాలని పేర్కొన్నారు. అటవీ హక్కుల కమిటీ, గ్రామపంచాయతీల్లో నిర్వహంచే తీర్మానాలను సరైన క్రమంలో నమోదు చేయాలన్నారు. ప్రతి అర్జీదారుడికి రసీదును అందజేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు వారి పరిధుల్లోని అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ.. క్లెయిమ్ ఫారాలు వస్తున్నప్పటికీ భూములకు సంబంధించిన సమాచారం నమోదు కావడం లేదని, సంబంధిత తహసీల్దార్లు క్లెయిమ్ ఫారాలు వస్తున్నప్పటికీ భూములకు సంబంధించిన సమాచారం నమోదు కావడం లేదని, ఈ విషయమై సంబంధిత తహసీల్దార్లు పరిశీలించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్లు, అటవీ శాఖ అధికారులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.