
సబ్‌ప్లాన్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలి
ఆదివాసీ మహనీయుల స్ఫూర్తితో ఉద్యమించాలి
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు
ఘనంగా బిర్సాముండా జయంతి
ఇంద్రవెల్లి, నవంబర్ 15 : ఏజెన్సీ ప్రాంతంలోని భూమిపై సర్వ హక్కులు కేవలం ఆదివాసీ గిరిజనులకే ఉన్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయ దర్బార్‌హాల్‌లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన భగవాన్ బిర్సాముండా జయంతి ఉత్సవాల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్నాయక్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా విద్యాసాగర్‌రావు, అనంత్నాయక్కు గుస్సాడీ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కెస్లాపూర్ చేరుకొని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి మెస్రం వంశీయులతోపాటు సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి నాగోబా ఫొటోను బహూకరించారు. అనంతరం కుమ్రం భీం విగ్రహానికి ఫూలమాల వేసి నివాళులర్పించారు. దర్బార్‌హాల్‌లో ఏర్పాటు చేసిన భగవాన్ బిర్సాముండా, రాంజీగోండ్, కుమ్రం భీంతోపాటు ఆదివాసీ గిరిజన మహనీయుల చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులను గ్రామసభల ద్వారా మారుమూల గ్రామాల అభివృద్ధికి వాడుకోవాలని సూచించారు. దేశంలోని 10 రాష్ర్టాల్లో 1/70 చట్టం అమల్లో ఉందన్నారు. తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో ఈ చట్టం అమలు చేస్తుండగా.. ఏజెన్సీ చట్టాల ప్రకారం అన్ని హక్కులు ఆదివాసీ గిరిజనులకే దక్కాలని పేర్కొన్నారు. ఏజెన్సీలోని గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూములను ఆదివాసీ గిరిజనులకే అమ్ముకోవాలని తెలిపారు. గిరిజనేతరులు ఆ భూములను వదులుకొని వెళ్లిపోవాలి లేదా ప్రభుత్వం వారి నుంచి భూములు కొనుగోలు చేసి ఆదివాసీ గిరిజనులకు పంచి పెట్టాలన్నారు. ఏజెన్సీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలను నిలిపివేసే హక్కులు 5వ షెడ్యూల్ ప్రకారం పూర్తి అధికారాలు గవర్నర్‌కు ఉన్నాయని తెలిపారు.
తాను మహారాష్ట్రలో గవర్నర్‌గా ఉన్నప్పుడు 5వ షెడ్యూల్ ప్రకారం వనవాసీ గ్రామసభలను ఏర్పాటు చేసి ఆదివాసీ గిరిజనుల అభివృద్ధితోపాటు గ్రామాల అభివృద్ధికి దాదాపు రూ.1200 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాంజీగండ్, కుమ్రం భీం, భగవాన్ బిర్సాముండా జీవిత చరిత్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలు చదువుకొనేలా పుస్తకాల రూపంలో అందించాలని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజన మ హనీయులను ఆదర్శంగా తీసుకొని హక్కుల కోసం పోరాటా లు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఏజెన్సీలో అమలు చేస్తు న్న అటవీ శాఖ చట్టం 1927ను సవరించి అటవీ ఉత్పత్తులతోపాటు అటవీపై ఆదివాసీ గిరిజనులకు అన్ని హక్కులు క ల్పించాలన్నారు. బిర్సాముండాను బంధించిన రాంచీలోని జైలుకు బిర్సాముండాగా నామకరణం చేయాలన్నారు. ఆదివాసీ గిరిజనులు ఆత్మగౌరవం కోసం ఉద్యమించాలన్నారు. ఏజెన్సీలో పెసా చట్టాలతోపాటు కోనేరు రంగారావు సిఫార్సులను ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం ఆదివాసీ మహనీయుల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐటీడీఏ పీవో అంకిత్, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ రాఘవేంద్రరావ్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, అఖిల భారత్ వనవాసీ కల్యాణ ఆశ్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్‌కే నాగు, వనవాసీ విద్యా విభాగం రాష్ట్ర ప్రముఖ్ రాంచంద్రరా వ్, మెస్రం దుర్గు, మెస్రం వెంకట్రావ్పటేల్, సిడాం భీం రావ్, హనుమంత్‌రావ్, దేవేందర్‌రావ్, మెస్రం నాగ్నాథ్, మనోహర్, మెస్రం శేఖర్‌బాబు, ఆనంద్‌రావ్ పాల్గొన్నారు.