
ఉపాధ్యాయురాలి ట్వీట్‌కు స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం స్పెషల్ ట్రిప్పు
కోటపల్లి, నవంబర్ 15 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల ఇబ్బందులపై ఓ టీచర్ చేసిన ట్వీట్‌కు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. చెన్నూర్ నుంచి కోటపల్లికి ఉదయం పూట బస్సు సౌకర్యం లేక పిల్లలు అవస్థలు పడుతుండగా, కోటపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల టీచర్ భారతి గత మంగళవారం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన చొరవ తీసుకొని చెన్నూర్ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ ఉదయం ప్రత్యేకంగా బస్సు నడిపిస్తున్నారు. ఇందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థులు, టీచర్ కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల ఇబ్బందులపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. చెన్నూర్ నుంచి కోటపల్లికి ప్రతి రోజూ ఉదయం పూట 105 నుంచి 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఆర్టీసీ బస్సులు వెళ్తుంటారు. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు నడవడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా, అందుకు సంబంధించిన వీడియోను కోటపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి మంగళవారం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. తన కార్యాలయ ఉద్యోగి కిరణ్ సెల్ నంబర్ ఇచ్చి, అతడిని సంప్రదించాలని సూచించారు. బస్సు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఆమె కిరణ్ దృష్టికి తీసుకెళ్లగా, చెన్నూర్ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ ఉదయం అదనపు బస్సు నడిపిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల డిపో అధికారులకు ఆయన సూ చించడంతో బుధవారం ఉదయం మోడల్ స్కూల్ విద్యార్థులు కేటాయించిన అదనపు బస్సులో పాఠశాలకు వెళ్లారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మోడల్ స్కూల్ విద్యార్థులు, కస్తూర్బా పాఠశాల టీచర్ భారతి కృతజ్ఞతలు తెలిపారు.
థాంక్యూ సజ్జనార్ సార్..
నేను కోటపల్లి మోడల్ స్కూల్లో చదువుతున్నా. ఉదయం సరిపడా బస్సులు లేవు. దీంతో ఒక సీట్లో నలుగురు నుంచి ఐదుగురు కూర్చోని వెళ్లేవాళ్లం. టీచర్ ట్వీట్ చేయడం ద్వారా ప్రస్తు తం మా పాఠశాలకు అదనంగా మరో ప్రత్యేక బస్సు నడుపుతున్నారు. ఇప్పుడు తిప్పలు తప్పినయ్. మా కష్టాలను అర్థం చేసుకొని సమస్యను తీర్చిన సజ్జనార్ సార్‌కు థాంక్యూ.
-బీ సాక్షిత, (చెన్నూర్)
ఇబ్బందులు తప్పినయ్..
చెన్నూర్ నుంచి 150 -200 మంది విద్యార్థులం ప్రతిరోజూ కోటపల్లి మోడల్ స్కూల్‌కు రాకపోకలు సాగిస్తుంటాం. అయితే ఉన్నది ఒక్కటే బస్సు. అం దులోనే చాలా ఇబ్బందులు పడుతూ వెళ్లేవాళ్లం. సజ్జనార్ సార్ చొరవతో మా పాఠశాలకు ఉదయం పూట అదనపు బస్సు నడిపిస్తున్నారు. దీంతో మా ఇబ్బందులు తప్పనయ్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
-అభిరాం, (చెన్నూర్)
విద్యార్థుల అవస్థలు చూడలేకే..
మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయు లు, ఇతర ఉద్యోగులు ఆర్టీసీ బస్సులోనే కోటపల్లికి వెళ్తుంటాం. రద్దీ అధికంగా ఉన్నప్పటికీ అదనపు బస్సు లేక చాలా ఇబ్బందులు పడుతూ వెళ్లేవాళ్లం. దీంతో విద్యార్థుల కష్టాలను వీడియో తీసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశాను. ఆయన స్పందించి ఆర్టీసీ అధికారుల ఫోన్ నంబర్ ఇచ్చారు. వారి దృష్టికి కూడ సమస్యను తీసుకెళ్లాను. బుధవారం నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు అదనపు బస్సును కేటాయించారు. సజ్జనార్ సారుకు కృతజ్ఞతలు.