
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 14 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మంగళవారం నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 7, 8, 9, 10వ తరగతులు.., మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:45 వరకు 8, 9వ తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీసీఈబీ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని బాలక్మందిర్లో పరీక్షలను సెక్టోరల్ అధికారి కంటె నర్సయ్య పరిశీలించారు. పకడ్బందీగా నిర్వహించి మూల్యాంకనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం హూర్బాను, ఉపాధ్యాయులు మనోహర్ రెడ్డి, ఇమ్రాన్ రసూల్, అశ్వాక్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గాం ఆశ్రమ పాఠశాలలో డీఈవో తనిఖీ..
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 14 : ఎస్ఏ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. పట్టణంలోని ఈద్గాం ఆశ్రమ పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ పరీక్షలు ఎంతగా దోహదం చేస్తాయన్నారు.
మల్లాపూర్ గొండు గూడెం ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో శ్రీనివాస్ రెడ్డి..
దస్తురాబాద్, డిసెంబర్ 14 : మండలంలోని మల్లాపూర్ గొండు గూడెం ఆశ్రమ పాఠశాలను డీటీడీవో శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. ఎస్ఏ1 పరీక్షలను, పాఠశాల, కంప్యూటర్ గదులతో పాటు వంట గదిని, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. పాఠశాల గదులను శుభ్రంగా ఉంచాలని, శానిటైజేషన్ చేయించాలని సూచించారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు గణేశ్, శ్రీనివాస్, వినోద్, మోహన్‌దాసు, సతీశ్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్..
సిరికొండ, డిసెంబర్ 14 : మండలంలోని రాయిగూడ ఆశ్రమోన్నత పాఠశాలలో ఉట్నూర్ ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్ సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పదోతరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఆయన వెంట పాఠశాల హెచ్ఎం నిశికాంత్, ఉపాధ్యాయుడు మూగ శ్రీనివాస్, జగదీశ్, భీంరావ్ రామ్, వ్యాయామ ఉపాధ్యాయుడు గణేశ్, గ్రామపటేల్ తదితరులు ఉన్నారు.