
కుమ్రంభీం ఆసిఫాబాద్ ఇన్చార్జి ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర
తిర్యాణి, సెప్టెంబర్ 14 : గిరిజనుల అభ్యున్నతికి పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, వారి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తామని కుమ్రంభీం ఆసిఫాబాద్ ఇన్చార్జి ఎస్పీ వైవీఎస్ సుధీం ద్ర అన్నారు. ‘పోలీసులు మీకోసం’లో భాగం గా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చిరాక్ ఫౌండేషన్ సాకేత్ ఆలూరి వారి సహకారంతో పంగిడిమాధరలో 250 మంది గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారన్నారు. విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించి తమవంతుగా చేయూతనందిస్తామన్నారు. అసాంఘిక శక్తులతో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. తప్పుడు ఆలోచనలతో జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి రహిత మండలం గా మార్చేందుకు తోడ్పడాలని కోరారు. ప్ర భుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ముందుకు సాగాలన్నారు. మూఢనమ్మకాలను నమ్మవద్దన్నారు. మంత్రాలు, తంత్రాలు అనేవి వాస్తవాలు కావని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పంగిడిమాధర ఆదివాసీ గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు పోలీసు లు కృషి చేయడం అభినందనీయమన్నారు. యువత చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తే బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఆదివాసులు అన్నిరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. పోలీసుల ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నిర్వహించిన వైద్య శిబిరం లో మంచిర్యాల హెల్త్‌కేర్ దవాఖాన నుంచి వచ్చిన ఎనిమిది మంది వైద్యులు సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు అందజేశారు. చిరాగ్ ఫౌండేషన్(అమెరికా) సాకేత్ ఆలూరి సహకారంతో పంపించిన 300 రగ్గులను 10 గ్రామాల్లోని గిరిజనులకు అందజేశారు. ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్ఐ రామారావు, గ్రామాల పటేళ్లు, సర్పంచ్‌లు, పోలీసులు ఉన్నారు.