
మంచిర్యాల, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ);ఆయిల్‌పామ్.. మంచి డిమాండ్ ఉన్న పంట. దీర్ఘకాలిక ఆదాయాన్ని ఇస్తుంది. చీడపీడలకు ఎదురొడ్డి నిలబడుతుంది. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతంలోనే ఇది పండుతుంది. మొక్కలు నాటిన మూడేండ్ల తర్వాతి నుంచి దిగుబడి మొదలవుతుంది. ఏటా ఎకరానికి 2లక్షల చొప్పున దాదాపు 30ఏండ్ల వరకు లాభాలు కురిపించే ఈ పంటకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక ప్రోత్సాహమిస్తున్నది. పండిన పంటకు ప్రత్యేక ఫార్మర్ కోడ్, పక్కా మార్కెటింగ్ సౌకర్యాలతోపాటు క్రాఫ్ వచ్చేనాటికి ఎకరానికి ఏటా 36వేల సబ్సిడీ సైతం ఇస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విరివిగా సాగవుతుండగా, పంట మార్పిడి కింద వేసేందుకు మెజార్టీ రైతాంగం ఆసక్తి చూపుతున్నది.
భీమారం నర్సరీలో సిద్ధంగా మొక్కలు..
ఆయిల్ పామ్ అనేది దీర్ఘకాలిక పంట.. ఎకరానికి 57 మొక్కలు త్రిభుజాకార పద్ధతిలో నాటుతారు. ఆయిల్ పామ్ మొక్కలకు నీరు, సూర్యరశ్మి కావాలి. ఎకరానికి పది టన్నుల పైన దిగుబడి వస్తుంది. మంచిర్యాల జిల్లాలోని భీమారం నర్సరీలో మాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో 20 ఎకరాల స్థలంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచుతున్నారు. 10 నెలల వయస్సు ఉన్న 20 వేల మొక్కలు 300 ఎకరాలకు పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. వీటిని జనవరి వరకు పంపిణీకి అందించేలా సిద్ధంగా ఉంచారు. ఇంకా షెడ్లో లక్షన్నర మొక్కలు రెడీ అవుతున్నాయి. వీటిని కోస్టారికా, థాయిలాండ్ నుంచి తెప్పించారు. ఇవి షెడ్లో మూడు నెలలు పెంచిన తర్వాత బయట సంచుల్లోకి మార్చి ప్రధాన నర్సరీకి తరలిస్తారు. అక్కడ 9 నెలల పాటు పెంచుతారు. మొత్తానికి 12 నెలల తర్వాత మొక్క పంపిణీకి సిద్ధమవుతుంది.
క్షేత్ర సందర్శన ద్వారా అవగాహన
సీఎం కేసీఆర్ ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచించడం, ప్రోత్సాహమిస్తామని ప్రకటించడంతో అధికారులు రంగంలోకి దిగారు. సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులను క్షేత్ర ప్రదర్శనలకు తీసుకెళ్తున్నారు. ఈ మేరకు ఇటీవలే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో 6 బస్సుల్లో దాదాపు 204 మంది రైతులు, హార్టికల్చర్ అధికారులు, మాట్రిక్స్ ఫీల్డ్ సిబ్బంది కలుపుకొని 250 మందిని క్షేత్ర సందర్శనకు వెళ్లి అన్నింటిపై అవగాహన కల్పించారు. ఇందులో చెన్నూర్ మండలం ఆస్నాద్ గ్రామం నుంచే విప్ సుమన్ సహకారంతో 40 మంది రైతులను, ప్రజాప్రతినిధులను ప్రత్యేక బస్సులో భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనకు తీసుకెళ్లారు. గతంలోనూ 3వేల వేల మంది రైతులను 60 బస్సులలో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. కాగా, మొత్తంగా రైతుకు ఆయిల్ మొక్కల పెంపకం మొదలు పామాయిల్ నూనె తీసే దాకా జరిగే ప్రక్రియలను ప్రత్యక్షంగా చూపించారు. మార్కెటింగ్‌పై రైతుల్లో కొద్దిరోజులుగా వ్యక్తమవుతున్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఆయిల్ పామ్‌ను కంపెనీలు కొనాల్సిందేనని, రేటు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నల్ల భూముల్లో వేసిన ఆయిల్ పంటలను చూపించి, నల్ల భూముల్లో సాగుపై అపోహలను నివృత్తి చేశారు. అన్ని సీజన్లలో అన్ని నేలల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేయవచ్చని అవగాహన కల్పించగా, రైతులు సంతృప్తి చెందారు.
పామ్ వైపు రైతన్న అడుగులు..
క్షేత్ర సందర్శనలు.. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంట కావడంతో జిల్లాతోపాటు ఉమ్మడి జిల్లా రైతులూ ఆసక్తి చూపుతున్నారు. పంట మార్పిడిలో వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అధికారులను సంప్రదిస్తూ, పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, జిల్లాలో ఆయిల్ పామ్ తోటలకు 15 మండలాల్లో అనువైన వాతావరణం ఉందని కేంద్ర సంస్థల సర్వే అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. జిల్లాలో గత 2020-21 సంవత్సరంలోనే పైలట్ ప్రాజెక్టు కింద చెన్నూర్ నియోజకవర్గంలో 400 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించారు. మానిటరింగ్ బాధ్యతలు మాట్రిక్స్ కంపెనీ చూస్తుండగా, మొత్తంగా 152 మంది రైతులు 407 ఎకరాల్లో సాగు చేశారు. కాగా, మొక్కల పెరుగుదల 2021 సంవత్సరం నుంచి మొదలుకాగా, 2025లో గెలలు వస్తాయి. ఆ లోపు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు మాట్రిక్స్ కంపెనీ ప్రతినిధి ఉదయ్‌కుమార్ తెలిపారు. కాగా, వచ్చే సీజన్‌కు జిల్లాలో 1500 ఎకరాలకు తోటలు విస్తరించే అవకాశం ఉందని, పెద్ద సంఖ్యలో రైతులూ తోటలు పెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
మిల్లు ఏర్పాటుకు సన్నాహాలు..
పామాయిల్ తోటలకు మన నేలలు అనుకూలం. పార్టీ శ్రేణులు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. గతంలో 3వేల మంది రైతులను అశ్వారావు పేటకు తీసుకెళ్లి తోటలు చూపించి, రైతులతో మాట్లాడించాం. ఇటీవల కూడా విజ్ఞాన యాత్రకు వెళ్లి పామాయిల్ తోటలు చూసివచ్చారు. నేను కూడా 30 ఎకరాల్లో తోట వేశా. మార్కెటింగ్ గ్యారెంటీ ఉన్న ఏకైక పంట ఆయిల్ పామ్. ఇందులో దళారులు ఉండరు. రైతుల వద్ద నుంచి కంపెనీయే నేరుగా పంటను కొంటుంది. ప్రతి నెలా గెలల ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి ఆయిల్ పామ్ సాగు పంట సేకరణకు మాట్రిక్స్ కంపెనీ వచ్చింది. రూ.150 కోట్లతో చెన్నూర్ నియోజకవర్గంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సాగు విస్తీర్ణాన్ని బట్టి మిల్లు విస్తరణ కూడా జరుగుతుంది. ఇక్కడివారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
తోటల పెంపునకు కృషి..
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ తోటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 16 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆగస్టు వరకు మరో వంద ఎకరాల్లో సాగు చేసేలా కృషి చేస్తున్నాం. మా గ్రామం నుంచి 36 మంది రైతులు విజ్ఞాన యాత్రకు భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లారు. 30 ఏండ్లుగా సాగవుతున్న పంటలను అక్కడి రైతులతో కలిసి పరిశీలించి, అన్నీ తెలుసుకొని వచ్చారు. సంబురపడ్డారు.-ఏలేశ్వరం నాగభూషణం చారి, సర్పంచ్, ఆస్నాద్, (చెన్నూర్‌రూరల్)
సందేహాలను నివృత్తి చేశాం..
నల్లరేగడి నేలల్లో సాగుపై క్షేత్ర స్థాయి పరిశీలనకు మాట్రిక్స్, ఉద్యానశాఖ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి, దమ్మపేటకు తీసుకెళ్లాం. చిన్న మొక్కల నుంచి మొదలుకొని కోత దశలో ఉన్న వాటిని కూడా చూపించాం. నల్ల భూముల్లో పంట వేసిన రైతులతో మాట్లాడించి అనుమానాలను నివృత్తి చేయించాం. అక్కడ అధికంగా మక్క, మిరపను అంతరపంటగా వేశారు. మనదగ్గర పత్తి, మిరప, మక్క, కూరగాయలు, పెసలు, మినుములు, కంది, కర్బూజ వేసుకోవచ్చు. జిల్లా వ్యవసాయాధికారితో కలిసి భీమారం తోటలో పెరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కలను కూడా పరిశీలించాం.-శ్యాంరావ్ రాథోడ్, డీహెచ్‌ఎస్‌వో, మంచిర్యాల జిల్లా
అంతర పంటలకు అవకాశం..
ఆయిల్ పాం తోటలను సాగు చేసే వారు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలున్నాయి. మొక్క నాటిన నాలుగేళ్ల దాకా కూరగాయలు, మక్క, పల్లి, పత్తి, అరటి, బొప్పాయి వంటి వాటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. నాలుగేళ్ల తర్వాత గెలలు వేసి దిగుబడి మొదలవుతుంది. అప్పటి నుంచి మరో 25 ఏళ్ల వరకు చాక్లెట్ పంటను ఏటా అంతర పంటలుగా సాగు చేయవచ్చు. చాక్లెట్ కంపెనీవారే విత్తనాలు, పురుగుల మందులు సరఫరా చేసి ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ఎకరాకు ఇలా 30 వేల నుంచి 40వేల దాకా అదనపు ఆదాయం సమకూరుతుంది.