
బిర్సాముండా జయంతి వేడుకలతోపాటు జనజాతి గౌరవ దినోత్సవానికి హాజరు
సర్వం సిద్ధం చేయాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఇంద్రవెల్లి / ఉట్నూర్, నవంబర్ 14 : మండలంలోని కెస్లాపూర్ నాగోబా దర్బార్‌హాల్‌లో సోమవారం నిర్వహించే బిర్సాముండా జయంతి, జనజాతి గౌరవ దినోత్సవానికి వస్తున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బహిరంగసభ ఏర్పాట్లు ప్రొటోకాల్ ప్రకారం పకడ్బందీగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కెస్లాపూర్ నాగోబా దర్బార్హాల్తోపాటు బహిరంగ సభ ఏర్పాట్లను ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, ఉట్నూర్ ఐటీడీఏ పీవో అంకిత్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్‌తో కలిసి ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై సంబంధిత ఆయా శాఖలకు చెందిన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అఖిల భారత వనవాసీ కల్యాణ ఆశ్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్‌కే నాగుతో గవర్నర్ రాకతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లు, చేపట్టే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గవర్నర్ బహిరంగసభ వేదికతోపాటు నిర్వహించే కార్యక్రమాల వద్దకు ప్రొటోకాల్ పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వేదికపైకి ఎవరికీ అనుమతి ఉండదని, ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలని పేర్కొన్నారు. గవర్నర్ పర్యటించే నాగోబా ఆలయ ఆవరణ మార్గాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. కుమ్రం భీం విగ్రహానికి రంగులు వేసి, అక్కడ ఎలాంటి అపరిశుభ్రత వాతావరణం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి వెంట ఉట్నూర్ ఆర్డీవో జాడి రాజేశ్వర్, తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎంపీడీవో పుష్పలత, ఐటీడీఏ డీఈ తానాజీ, ఈవో మహేశ్, ఆదిలాబాద్ ఏఎస్పీ వినోద్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఉట్నూర్ సీఐ పైదారావ్, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, ఆయా శాఖలకు చెందిన అధికారులున్నారు.
గవర్నర్ పర్యటన వివరాలివే..
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి ఉదయం 10 గంటలకు హెలిప్యాడ్ ద్వారా బయలుదేరి ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌కు 11 గంటలకు చేరుకుంటారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో 11.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 12 గంటలకు కెస్లాపూర్ చేరుకుంటారు. 12.30 గంటలకు నాగోబా ఆలయానికి చేరుకొని నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తారు. 12.45గంటలకు కుమ్రం భీం విగ్రహానికి ఫూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఒంటి గంటకు శ్రీ భగవాన్ బిర్సాముండా చిత్రపటానికి ఫూలమాల వేసి నివాళులర్పిస్తారు. 1.15 గంటలకు దర్బార్‌హాల్‌కు చేరుకొని 2 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో అం కిత్, ఎస్పీ రాజేశ్చంద్ర ఉట్నూర్‌లోని హెలిప్యాడ్, విశ్రాంతి భవనాన్ని సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొదటగా ఉ ట్నూర్ చేరుకొని అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. అధికారుల కు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి వెళ్లారు.