
నివారణకు సర్కారు పకడ్బందీ చర్యలు
ముమ్మరంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
దోమల నివారణకు ప్రత్యేక బృందాలు
ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు
ఆదిలాబాద్, ఆగస్టు 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో డెంగీ నివారణపై వైద్యాధికారులు నజర్ పెట్టారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మలేరియా, డయేరియా, డెంగీ ప్రభావం లేదు. ప్రస్తుతం సర్కారు దవాఖానల్లో పరీక్షలు పకడ్బందీగా చేస్తుండగా.. ప్రైవేట్ వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారించి చికిత్స చేస్తున్నారు. బాధితులు ఆందోళన చెందడంతో డెంగీ ప్రభావం అధికంగా ఉందని ప్రచారం జరుగుతున్నది. దీంతో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. పక్కాగా పరీక్షలు నిర్వహించని ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేస్తున్నారు. శాంపిళ్లను రిమ్స్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాతే చికిత్స అందించాలని సూచిస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వానకాలం వ్యాధుల నివారణలో భాగంగా వైద్యశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన రెండున్నర నెలలు గడుస్తున్నా మలేరియా, డయేరియా, డెంగీ లాంటి వ్యాధుల ప్రభావం లేదు. రెండు జిల్లాల్లో కొన్ని రోజులుగా డెంగీ అనుమానిత కేసులు వస్తుండడంతో వైద్యశాఖ అధికారులు నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పట్టణాలు, గ్రామాల్లో జర్వంతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ నిర్ధారణ కోసం ఎలిసా పరీక్షలు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆధునిక యంత్రాలతో పాటు సంబంధిత సిబ్బందిని నియమించింది. పీహెచ్‌సీల్లో అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను రిమ్స్‌కు తీసుకువచ్చి పరీక్షలు చేస్తున్నారు. రోజు 100కు పై నమూనాలు సేకరిస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. డెంగీ వ్యాధికి కారణమైన అడిస్ దోమల నివారణకు సైతం అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో 20 మంది బ్రీడర్ చెకర్స్‌ను నియమించి యాంటిలార్వా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ రోజు 250 ఇళ్లకు వెళ్లి దోమల, లార్వాలు పెరిగే ప్రాంతాలను గుర్తిస్తారు. ఇండ్లతో పాటు పరిసరాల్లో నీటి నిల్వలను తొలగిస్తారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తారు.
పక్కాగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
రెండు జిల్లాల్లో కొన్ని ప్రైవేటు దవాఖానలలో జర్వం వచ్చిన వారికి రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్త కణాలు తగ్గితే డెంగీ చికిత్స చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన చెందడంతో పాటు డెంగీ ప్రభావం ఎక్కువ ఉందనే ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ వైద్యశాలల నిర్వాహకులు సైతం ఎలిసా పరీక్షల ద్వారానే డెంగీని గుర్తించడానికి వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పక్కాగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని నోటీసులు జారీ చేశారు. జర్వం వచ్చిన వారి నుంచి సేకరించిన శాంపిళ్లను రిమ్స్‌కు పంపాలని, నివేదిక వచ్చిన తర్వాతే చికిత్స అందించాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు పీహెచ్‌సీల్లో డెంగీకి చికిత్సలు అందించేలా చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, అనుమానితుల శాంపిళ్లు తీసుకుంటున్నారు. వారం పాటు యాంటీ లార్వా యాక్టివిటీస్ నిర్వహించడంతో పాటు ఇండ్ల ఆవరణలో దోమల పెరుగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ముమ్మరంగా పరీక్షలు
జిల్లాలో డెంగీ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.దోమల నివారణలో భాగంగా వివిధ శాఖల అధికారులతో సమన్వయం సమావేశం నిర్వహించాం. రోజు 100 వరకు నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. 20 మంది దోమల బ్రీడింగ్ చెకర్స్‌ను నియమించి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో అందరి నమూనాలు తీసుకుంంటున్నాం. వారం పాటు దోమల నివారణ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
ఎం శ్రీధర్, జిల్లా మలేరియా అధికారి, ఆదిలాబాద్