మానకొండూర్, నవంబర్ 12: దళారి వ్యవస్థను తీసుకువచ్చి రైతుల బతుకులు ఆగం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. వరిధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నియోజకవర్గస్థాయి మహాధర్నాకు విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలల నుంచి పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, బీజేపీకి రైతులమీదా ప్రేమ ఉందా? అని ప్రశ్నించారు. ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకునే రైతును కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మార్చాలన్నదే మోదీ ఉద్దేశమని, అందుకే కేంద్ర ప్రభుత్వం నల్లసాగు చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. దేశంలో పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తూ తెలంగాణలో కొనబోమని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, పంటపెట్టుబడి తదితర సంక్షేమపథకాలతో అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తుంటే.. కేంద్రప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. రైతు సంక్షేమంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే యాసంగి పంటను కొనుగోలు చేసేలా కేంద్రం నుంచి జీవో తీసుకు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే రేపటినుంచి ఊరూరా గ్రామాల్లో దండోరా వేయిస్తామన్నారు. బీజేపీ నాయకుల మోసపూరిత చర్యలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. అనంతరం పల్లెమీద చౌరస్తా నుంచి కాలినడకన తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసీల్దార్‌కు విపతి పత్రం అందజేశారు, కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ఱారావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గూడెల్లి తిరుపతి, ఆరు మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఆయా పీఏసీఎస్‌ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, టీఆర్ఎస్ అనుంబంధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కేంద్రం తీరుపై ఉద్యమిస్తాం
చిగురుమామిడి, నవంబర్ 12: రైతుల జీవితాలతో చెలగాటమడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని ఎంపీపీ కొత్త వినీత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రం హుస్నాబాద్‌లో శుక్రవారం తలపెట్టిన రైతుధర్నాకు తరలి వెళ్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ర్యాలీని కొండాపూర్‌లో జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంకు శ్రీనివాస్ రెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.