
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 30 :నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలపై పోలీసులు దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన భైంసా, నిర్మల్‌పై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తుతుండగా, మద్యం, గుట్కా, కలప, గుడుంబా, గంజాయి రవాణాకు చెక్‌పడింది.
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలపై పోలీసులు దృష్టిపెట్టారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం.., అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంతో పాటు మత్తు పదార్థాలపై నిఘా ఉంచి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీసులు ముందుకెళ్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన భైంసా, నిర్మల్‌లో ప్రత్యేక నిఘా ఉంచారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పోలీసులు నిత్యం ఏదో ఒక చోట కార్డన్ సెర్చ్ ద్వారా తనిఖీలు చేపడుతున్నారు. ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు పోలీసులు 13 సార్లు కార్డన్ సెర్చ్ చేపట్టారు. కార్డన్ సెర్చ్ ద్వారా వందలాది వాహనాలతో పాటు, మద్యం, గుట్కా, కలప, గుడుంబా, గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు.
సత్ఫలితాలిస్తున్న కార్డన్ సెర్చ్..
జిల్లా పోలీసులు చేపడుతున్న కార్డన్ సెర్చ్ సత్ఫలితాలిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 13 చోట్ల చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున జీరో వ్యాపారం జరుగుతున్నట్టు తెలిసింది. అలాగే వివిధ రాష్ర్టాల నుంచి వలస వచ్చిన వారి అక్రమ దందా బయటపడడంతో పాటు పలు కేసుల్లో దోషులుగా ఉంటూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న నేరస్తులను సైతం పట్టుకునేందుకు దోహదపుతున్నది.
బయటపడుతున్న మద్యం, గుట్కా..
జిల్లాలో చేపడుతున్న కార్డన్ సెర్చ్‌లో రూ.లక్షల విలువ చేసే నిషేదిత గుట్కా ప్యాకెట్లు, మద్యం అక్రమ నిల్వలు బయటపడుతున్నాయి. అనుమతులు లేకుండా కాలనీల్లో బెల్టు షాపులు నిర్వహించడంతో పాటు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసాలోని పలు చోట్ల చేపట్టిన కార్డన్ సెర్చ్‌లో భారీగా మద్యం, కిరాణ దుకాణాల్లో గుట్కా, గంజాయి, కలప స్వాధీనం చేసుకున్నారు.
అక్రమార్కుల గుండెల్లో గుబులు..
ఈ కార్డెన్ సెర్చ్‌తో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతున్నది. పోలీసులు ఎప్పుడు ఏ ప్రాంతంలో తనిఖీలు చేపడుతారోనని భయాందోళన చెందుతున్నారు. అక్రమార్కులు, పాత నేరస్తులు, ఇతర ప్రాంతాల్లో నిందితులుగా ఉండి జిల్లాలో తలదాచుకుంటున్న వారిలో ఆందోళన మొదలైంది.
కార్డన్ సెర్చ్‌లో పట్టుబడివని..
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో వందల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేని 1299 బైకులు, 96 ఆటోలు, 20 కార్లు, రూ.37,600 విలువ గల గుట్కా, 3 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 48 లీటర్ల గుడంబా, బెల్ట్ షాప్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన రూ.63,400 విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నరు. అలాగే ప్రజలకు ట్రాఫిక్ రూల్స్, అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని, నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలు, గృహహింస, న్యాయ విజ్ఞాన సదస్సులు, సీసీ కెమెరాల వినియోగం, వాటి ఉపయోగాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు..
జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు కార్డన్ సెర్చ్ చేపడుతున్నాం. ఈ కార్డన్ సెర్చ్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా గుట్కా, మద్యం, గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలు బయటపడుతున్నాయి. శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం.