
ఎయిర్‌పోర్టుకు కేంద్ర మంత్రి సానుకూలత
ఎయిర్‌ఫోర్స్ ద్వారా ఏర్పాటుకు హామీ
ఏఏఐ అనుకూల నివేదిక
ఆదిలాబాద్, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఉడాన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)ను కోరింది. పలు మార్లు ఆదిలాబాద్‌కు వచ్చిన అధికారులు భూమి, సాంకేతిక, ఇతర అంశాలను పరిశీలించారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలంగా నివేదికలు ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. ఎయిర్‌ఫోర్స్ ద్వారా ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసేందుకు తమ శాఖ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.
తెలంగాణలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉడాన్ పథకంలో భాగంగా ఏర్పాటు కానున్న ఎయిర్‌పోర్టుల్లో ఆదిలాబాద్ కూడా ఉంది. గతంలోనే ప్రభుత్వం విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ను కోరింది. దీంతో రెండేళ్లలో ఏఏఐ బృందం సభ్యులు పలుమార్లు ఆదిలాబాద్‌లో పర్యటించగా, చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ 11,12 తేదీల్లో విమానాశ్రయం స్థలాన్ని పరిశీలించారు. రన్‌వే దిశను, విండ్ డైరెక్షన్, విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌నకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా..? అనే విషయాలను పరిశీలించారు. పాత జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వాసులు విదేశీ పర్యటనలు, తమ బంధువుల ఇండ్లలో శుభకార్యాలు, వ్యాపారాలు, విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే విమానం ఎక్కాల్సి ఉంటుంది. దీంతో హైదరాబాద్ లేదా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి నాగ్‌పూర్ 200 కిలోమీటర్లు, హైదరాబాద్ 300 కిలోమీటర్ల దూరం ఉంటాయి. దీంతో జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కేంద్రమంత్రి సానుకూలత
ప్రస్తుత ఎయిర్‌ఫోర్స్ స్థలంలో విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన భూమి 369 ఎకరాలు ఉందని మరో 49 ఎకరాలను సైతం రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ అధికారులు గుర్తించారు. విశాలమైన ఈ స్థలంలో విమానాలు లేవడానికి, దిగేందుకు ఎలాంటి కట్టడాలు, ఇతర అడ్డంకులు లేవని అధికారులు అంటున్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తమ పర్యటనల్లో సాంకేతిక అంశాలను, పలు విషయాలను పరిశీలించి ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయవచ్చని నివేదికలు ఇచ్చారు. దీంతో ఆదిలాబాద్‌కు గాలిమోటార్ వచ్చే విషయంలో మొదటి మెట్టు పడినట్లయ్యింది. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. ఎయిర్‌ఫోర్స్ ద్వారా ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు తమ శాఖ ద్వారా పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు.
విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలం
ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉందనే విషయాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఏఏఐ అధికారులు మైదానం, ఇతర అంశాలను పరిశీలించారు. ఆకాశమార్గాన పెద్దగా ఆటంకాలు ఏమీ లేవు. ఇంకా 49 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.