
క్షేత్ర స్థాయిలో వ్యవసాయాధికారుల పరిశీలన
ఆన్లైన్లో వివరాలు నమోదు
బోథ్, సెప్టెంబర్ 12: వానకాలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణలో వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు. పంటల వారీగా వివరాలు సేకరించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం, దిగుబడిని పరిగణలోకి తీసుకొని కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధర, తదితర వాటిని నిర్ణయించనున్నారు. బోథ్ మండలంలో 46,500 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో ఇప్పటి వరకు 85 శాతం సర్వే పూర్తి చేసి సాగు వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, పత్తి 24,571 ఎకరాల్లో, సోయా 11,017 ఎకరాల్లో, కంది 2,253 ఎకరాల్లో, 260 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. మిగిలిన 8,399 ఎకరాల్లో సాగు చేస్తున్న పంటల వివరాలు ఈ నెల 15లోగా సర్వే పూర్తి చేయనున్నారు. పత్తి, సోయా, కంది పంటలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం మార్క్ఫెడ్, సహకార సంఘాలు, నాఫెడ్, సీసీఐ ద్వారా మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్నది. ఆన్లైన్లో వివరాలు లేని రైతుల నుంచి పంటల కొనుగోలుకు నిరాకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో పరిశీలించాకే వివరాలు నమోదు
పంటల సాగు వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాకే నమోదు చేస్తున్నాం. పంటల కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే క్షేత్ర స్థాయిలో సర్వే చేపడుతున్నాం. మిగిలిన రైతులు తమ పొలాలకు వచ్చే ఏఈవోలకు సాగు వివరాల సమాచారం అందించాలని సూచిస్తున్నాం.
-వెండి విశ్వామిత్ర, మండల వ్యవసాయాధికారి
పంట అమ్మేటప్పుడు ఇబ్బందులు ఉండవు…
వేసిన పంట వివరాలు రాయించుకుంటే అమ్మేటప్పుడు ఇబ్బందులు ఉండవు. సీసీఐ వారు పత్తి, సొసైటోళ్లు సోయా కొనేటప్పుడు ఆన్లైన్లో పేరు ఉంటేనే తీసుకుంటున్నారు. అందుకే క్రమం తప్పకుండా వేసిన పత్తి, సోయా, కంది పంటల వివరాలు ఏఈవోను చేన్లకు తీసుకెళ్లి రాయించుకున్నా.
-సిగ్గుల్ల శంకర్, రైతు, కన్గుట్ట