
ఘన స్వాగతం పలికిన నాయకులు, యువకులు, ప్రజలు
సీఆర్పీఎఫ్ జవాన్లను సన్మానించిన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీలు
ఇచ్చోడ, సెప్టెంబర్ 12 :స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో కన్యాకుమారి నుంచి రాజ్‌ఘాట్(ఢిల్లీ) వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం జిల్లాకు చేరుకున్నది. నాయకులు, ప్రజలు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఇచ్చోడలోని సాథ్ నంబర్ గ్రామం వద్ద బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్.., నాలుగు వరుసల జాతీయ రహదారి (నిర్మల్) వద్ద డీఎస్పీ వెంకటేశ్వర్రావు.., ఆదిలాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న.., జిల్లా కేంద్రంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర.., నిర్మల్‌లో ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్ స్వాగతం పలికారు.
జాతీయ సమైక్యతా భావం పెంపొందేందుకు సీఆర్పీఎఫ్ జవాన్లు చేపట్టిన యాత్ర నిదర్శనమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సాథ్‌నంబర్ వద్ద జవాన్లను శాలువాలతో సత్కరించారు. దేశ రక్షణలో జవాన్ల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ముక్రా(కే) ఎంపీటీసీ గాడ్గె సుభాష్, నాయకులు ముస్తఫా, భాస్కర్, అజీమ్, భీముడు పాల్గొన్నారు.
డీఎస్పీ ఘన స్వాగతం..
నాలుగు వరుసల జాతీయ రహదారి (నిర్మల్) వద్ద ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావుతో పాటు నాయకులు, యువకు లు, విద్యార్థి సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. షార్ప్ గార్డెన్లో భోజన వసతి కల్పించారు. సర్పంచ్ చౌహాన్ సునీత, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, వివిధ పార్టీల నాయకులు బాబారావ్, నారాయణ రెడ్డి, సీఐ రమేశ్ బాబు, ఎస్ఐ ఫరీద్ పాల్గొన్నారు.
జవాన్లకు జోగు రామన్న సన్మానం..
ఎదులాపురం, సెప్టెంబర్12 : ఆదిలాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటున్న జవాన్లను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కలిశారు. వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ప్రజల ఐక్యత కోసం చేపట్టిన యాత్ర విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, నాయకులు తిరుపతి, శైలేందర్ ప్రశాంత్, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు రామకృష్ణ, పురుషోత్తంచారి తదితరులు ఉన్నారు.
స్వాగతం పలికిన ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ..
జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లకు కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీ 400 మీటర్ల జాతీయ జెండాతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇన్చార్జి ఎస్పీ జవాన్లతో కలిసి రెండు కిలోమీటర్ల మేర సైకిల్ నడుపుతూ స్థానిక జనార్దన్‌రెడ్డి ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. జవాన్లను సన్మానించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సైకిల్ యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుందని చైర్మన్ అన్నారు. అదనపు ఎస్పీ బీ వినోద్ కుమార్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్, డిప్యూటీ కమాండెంట్ దినేశ్ కుమార్ సింగ్, టీఎస్ ఎస్పీ కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, సీఐ అజయ్ కుమర్, కానిస్టేబుల్ కృష్ణకాంత్రాయ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ కృష్ణ మూర్తి, సీఐలు శ్రీనివాస్, రామకృష్ణ, పురుషోత్తంచారి, సుధాకర్‌రావు, గడికొప్పుల వేణు, ఎస్ఐలు అప్పారావు, అన్వర్ ఉల్ హక్, హరిబాబు, దివ్యభారతి పాల్గొన్నారు.
జవాన్లను సన్మానించిన నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 12 : స్థానిక శ్యాంఘడ్ కోట వద్ద జవాన్లను నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు ఎస్పీ రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి సన్మానించారు. జవాన్లకు పోలీస్ యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇన్చార్జి ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ శర్మ, సీఐలు రమేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, ఆర్ఐలు వెంకటి, కృష్ణాంజనేయులు ఉన్నారు.