
బహుజన బంజారా జాతిరత్నం జాలంసింగ్ చిరస్మరణీయుడు
కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనులకు గౌరవం
మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్
నిర్మల్ అర్బన్, జనవరి 12 : అర్హులైన గిరిజనుల పోడు భూములకు త్వరలోనే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తామని, వీటికి నీరు, కరెంట్ సదుపాయం ఇచ్చి సాగుకు యోగ్యంగా మారుస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించారు. నిర్మల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో జాలంసింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
అర్హులైన గిరిజనుల పోడు భూములకు త్వరలోనే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తామని, వీటికి నీరు, కరెంట్ సదుపాయం ఇచ్చి సాగుకు అనుకూలంగా మార్చుతామని.. వాటికి రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేస్తామమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నిర్మల్ పట్టణానికి వచ్చిన సత్యవతి రాథోడ్‌కు మంత్రి అల్లోల పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఐటీడీఏ పీవో అంకిత్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మొదటగా రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్సే ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలు, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అభివృద్ధి పనులు చేపడుతున్నారని.. వీటిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మన వద్ద అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయని, కొందరు ఇక్కడకు వచ్చి మాట్లాడడం సిగ్గు చేటని, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులు ప్రధానమంత్రి మోడీని నడిరోడ్డుపై నిలబెట్టారని, ఆ పరిస్థితి తెలంగాణలో కూడా తెచ్చుకోవద్దని సూచించారు. మన పథకాలు బాగున్నాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే.. కొందరు గల్లీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని, వారు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
నాడు జోడేఘాట్పై శీతకన్ను
ఆదివాసుల ఆరాద్యదైవం కుమ్రం భీం, ఈప్రాంత అభివృద్ధి గత పాలకులకు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే కుమ్రం భీం ఉద్యమ నాయకుని ప్రాంతం జోడేఘాట్‌ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో గిరిజన భవన్‌ను నిర్మిస్తున్నామన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వం లో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖలో సమర్థవంతగా పనులు జరుగుతున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.