
నాడు ఏ అన్నదాత ఇంట చూసినా ఎడ్లు
కుటుంబంలో ఒకటిగా మమేకం
ఎవుసంలో ప్రతి పనికీ వినియోగం
దుక్కి దున్నిన నాటి నుంచి ధాన్యం ఇండ్లకు చేరేవరకూ తోడు
చుట్టాలింటికైనా.. జాతరలకైనా వాటితోనే పయనం
యాంత్రీకరణతో పశుసంపద తగ్గుముఖం
గుర్తు చేసుకుంటున్న రైతాంగం
కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్,డిసెంబర్ 11 ;చేతికి అందనంత ఎత్తులో రెండు మూడు జతల కాడెడ్లు… వాటితో పాటు ఆవులు, లేగదూడలు, బర్రెలు, దుడ్డెలు.. పాతికేళ్ల క్రితం వరకు ప్రతి పల్లెలో కొట్టాల నిండా పదుల సంఖ్యలో కనబడేవి. రైతు స్థోమతను బట్టి ఈ సంఖ్య కొంచెం అటూ ఇటుగా ఉండేది. పశువుల లెక్కను బట్టి ఆ ఆసామి ఎవుసాన్ని సులువుగా అంచనా వేసేవారు. రాను రాను సాగులో యాంత్రీకరణ పెరుగుతూ వస్తుండగా.. పశువుల సంఖ్య నానాటికీ పడిపోతూ వస్తున్నది. అయితే, ఎడ్లపై అనుబంధాన్ని చంపుకోలేని రైతులు ఇప్పటికీ వాటితోనే సాగు చేసుకుంటున్నారు. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎడ్లతో ఎవుసం గురించి గుర్తు చేసుకుంటున్నారు.
నాగలెనుక నాగలి ఏడు నాగండ్లతో వేకువ జాముననే దున్నడానికి రైతులు దిగారంటే పొద్దుపొడిచి సూర్యుడు చురచుర లాడకముందే ఎకరన్నర అవలీలగా ఇరువాలు అయ్యేది. ఇలా పొద్దుమాపు కలిపి సులువుగా ఐదెకరాలు పొతం అయ్యేది. దుక్కులు పొతం చేయడం నుంచి విత్తనాలు వేయడం, కలుపు నివారణకు దౌర కొట్టడం, పొలంలో జంబు కొట్టడం, దున్నడం, గొర్రు తిప్పడం, పండిన పంటను ఇంటికి చేర్చే వరకు ఎడ్ల పాత్ర ఉంటుంది. గతంలో కరంట్ వినియోగం అంతగా లేని సమయంలో పంటలకు సాగు నీరు అందించేందుకు మోట బావుల నుంచి నీటిని తోడేందుకు ఎద్దులనే వినియోగించే వారు. పొలం కోసిన తర్వాత కల్లంలో వేసిన వరిపై ఎద్దులతో బంతులు కొట్టేవారు. అంతే కాదు, కల్లం నుంచి వరిధాన్యం, గడ్డి, మక్క కంకులు, పత్తి, ఇతర ఏ పంట ఉత్పత్తులైనా జారవేసేందుకు ఎద్దులు తప్పనిసరిగా అవసరమయ్యేవి. యాంత్రీకరణ పెరగడంతో ఎవుసంలో ఎద్దుల వినియోగం తగ్గిపోతున్నది.
ఊర్లకు వెళ్లడానికి ఎడ్లబండే..
గతంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లాలంటే ఎడ్ల బండినే ఉపయోగించేది. పెళ్లిళ్లు, పేరంటాలు, జాతరలకు ఎడ్లబండిలోనే వెళ్లేవారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పట్టణాల నుంచి నిత్యావరసర సరుకులు కూడా ఎడ్లబండ్లపైనే తీసుకువచ్చే వారు. ఇదే కాక సవారీ (చిన్న) కచ్చురం ఉండేది. ఇది ఏ రైతు ఇంట ఉంటే ఆ రైతును అప్పట్లో గొప్పోళ్లుగా భావించే వారు. ఇప్పుడు కారు ఉన్న వారిని ఎలా చూస్తున్నారో అప్పట్లో సవారీ కచ్చురం అలా ఉండేది. పిల్లను చూడ పోవాలన్నా.. అత్తవారి ఇంటికి వెళ్లాలన్నా ఈ ఎడ్లబండే ఉపయోగపడేది. పెండ్లిండ్ల సమయంలో ఎద్దులను గజ్జెలతో అలంకరించి బండెనుక బండి కట్టి ఒకరంటే ఒకరు పోటీబడి వెళ్లేవారు. అందుకే నేటి వృద్ధులు అప్పటి రోజులను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటారు.
‘ఎనుకట మాది ఏడు నాగళ్ల ఎవుసం..’ ఇప్పటికీ పల్లెటూళ్లలో తలనిండా జ్ఞాపకాలు పండిన తాతలు, అవ్వల నోట తరుచూ వినిపించే మాటిది! నిజానికి ఏడు నాగళ్ల ఎవుసం అంటే ఆ రైతు వద్ద 14 ఎడ్లున్నట్లు లెక్క! ఎడ్లు ఎంత ఎక్కువుంటే అంత మోతుబరి రైతన్నమాట! నాడు ఎడ్లు లేనిది ఎవుసం లేదు. పశువులు లేని ఇల్లులేదు! మందల్లేని ఊరులేదు! కానీ నేడా పరిస్థితి లేదు! వ్యవసాయంలో యాంత్రీకీకరణ పుణ్యమా అని పశుసంపద మాయమైంది..! సర్వం ట్రాక్టర్లమయమై ఎడ్లు లేని ఎవుసం మొదలైంది..!
నేడు ఎడ్లు లేని ఎవుసం..
ఒకప్పుడు ఎడ్లు లేకుండా ఎవుసం లేదు. కానీ, ట్రాక్టర్ల రాకతో సాగులో యాంత్రీకీకరణ మొదలైంది. దున్నడం నుంచి పంటను ఇంటికి చేర్చేదాకా ప్రతిపనిలోనూ యంత్రాల వినియోగం పెరిగింది. క్రమంగా పశువుల సంఖ్య తగ్గిపోయింది. ఎడ్ల ధర, పోషణ కూడా భారంగా మారింది. దాంతో పెంపకంపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇంకోవైపు బర్రెలు ఇచ్చిన స్థాయిలో స్థానిక ఆవులు పాలివ్వకపోవడంతో వీటి పెంపకం పూర్తిగా తగ్గిపోయింది. అంతిమంగా ఇది ఎడ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇప్పుడు అక్కడక్కడా ఎడ్లు కనిపిస్తున్నా.. అవి కూడా మూరమూల గ్రామాల్లోనే ఉన్నాయి. మిగతా చోట్ల వేళ్లపై లెక్కపెట్టేలా మాత్రమే మిగిలాయి.
ఇప్పటికీ ఎడ్లతోనే సాగు చేస్తున్న..
నాకు మా ఊళ్లె మూడెకరాల ఎవుసాయ భూమి ఉంది. నాకు 53 ఏండ్లుంటయ్. నేను 35 ఏండ్ల సంది ఎవుసం చేత్తున్న. తాత తండ్రుల నుంచి ఎవుసం చేసుకుంటనే బతుకుతున్న. ఎనుకట గీ టాక్టర్లు, మిషిన్లు లెవ్వు. ఇంటింటికీ ఎడ్లు, కట్టెతోని చేసిన నాగలి ఉండేటియి. పొలం ఏసినప్పుడు నాలుగైదు నాగండ్లు కట్టి దున్నెటోళ్లం. ఒక రోజు ఒక్కల పొలం, ఇంకో రోజు ఇంకొకల పొలం.. ఇట్ల బదలు పొయ్యి దున్నెటోళ్లం. మోట కొట్టుడు, ఆతాలువోసుడు, పొలం, దుక్కిదున్నుడు, గొర్రు కొట్టుడు గిట్ల అన్ని పనులకు ఎడ్ల అవుసరం ఉండేది. ఎడ్లనే కాదు.. ఆవులను, బర్రెలను పెంచెటోళ్లం. ఇటు ఎవుసం చేసు కుంట, అటు ఆవులు, బర్రెల పాలు అమ్ముకుంట బతికెటోళ్లం. ఎడ్ల, బర్రెల పెండ మురిగినంక తీసుక పొయ్యి పొలంల ఏసెటోళ్లం. దీంతోని పొలానికి మంచి బలం అత్తుండే. ఎనుకటి నుంచి ఇట్లనే ఎడ్లతోని ఎవు సం చేత్తున్న. ఇప్పుడు మిషిన్లు, టాక్టర్లు అచ్చినంక ఎడ్లతోని దున్నుడు బంజేసి వాటితోనే దున్నిపిచ్చు కుంటున్రు. పత్తిల దౌరకొట్టుడు, బోజలు కొట్టుడు అసోంటి చిన్న చిన్న పనులను ఎడ్లనాగలితోని చేత్తున్రు. రాన్రాను ఇవ్విగూడ కనిపిచ్చెతట్టు లెవ్వు.
నాటి కుటుంబంలో ఒకటిగా..
ఎద్దంటే నేడు ఒక పశువు మాత్రమే! కానీ, నాటి రైతులకు ఎనలేని ప్రేమ. ఎవుసంలో ప్రతి పనికీ తోడుగా ఉండే ఆ మూగజీవిని తమ కుటుంబంలో ఒకటిగా భావించేవారు. కొందరు రైతులైతే ప్రాణం లెక్క చూసుకునేవారు. వాటికి పేర్లు పెట్టి మరీ పిలుచుకునే వారు. ఆవులకు ల్యాగలు పుడితే ఆ ఇంట్లో ఎంతో సంబురపడేవారు. కుటుంబంలోకి కొత్తగా ఓ సభ్యుడు వచ్చినట్లు ఫీలయ్యేవారు. పండుగ రోజుల్లో పశువులను ప్రత్యేకంగా చూస్తారు. పొలాల అమావాస్య రోజైనా.. కనుమ రోజైనా పశువులను ఇప్పటికీ పూజిస్తారు. ఉదయాన్నే కడిగి.. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. అంత ప్రేమగా చూసుకునే ఎడ్లకు ఏమైనా అయి తే రైతులు ఏ మాత్రం తట్టుకోలేరు. ఒకవేళ ఎద్దు చనిపోతే ఆ ఇంటి సభ్యులు గుండెలవిసేలా దుఃఖిస్తారు. ఆ ఎద్దుతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరవుతారు.
ఎడ్లు లేకుంటే ఎవుసమే లేకుండే..
మేం ఇప్పుడంటే గీ ట్రాక్టర్లు, మిషిన్లు అచ్చినయ్. మా కాలంల ఏవీ లేకుండె. ఏ పనైనా ఎడ్లతోనే చేత్తుంటిమి. మాకు అన్నింటికీ అవే అక్కెరకు అచ్చేవి. ఎడ్లతోటి మోట కొట్టి పంటలకు నీళ్లు పెట్టేది. దుక్కులు దున్నుడు, బంతి కొట్టుడు, గడ్డి, వడ్లు జారగొట్టుడు వాటితోనేనాయె. అసలు ఎడ్లు లేకుంటే ఎవుసమే లేకుండె. చుట్టాల ఇండ్లకు, పెండ్లిండ్లకు పోవాలంటే అప్పుడు మాకు ఎడ్లబండ్లే దిక్కు. గొప్పోళ్లకైతే సవారీ కచ్చురాలుండేవి. ఇప్పుడు మిషిన్లు, మోటర్లు అచ్చినంక ఎడ్లతో పనిలేకుండా పాయె. ఇంకా ఎడ్లేడుంటయ్? ఇప్పటోళ్లకు ఎడ్లంటే ఓ పశువు. కానీ, మా మా ఇండ్లల్ల ఎడ్లను బిడ్డల్లెక్క చూసుకునేటోళ్లం.