
నిర్మల్ టౌన్, నవంబర్ 11 :కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలకు లోబడి ఆందోళన చేపట్టనుండగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, విప్ సుమన్‌తో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో శ్రేణులతో కలిసి పాల్గొననున్నారు.
యాసంగి వడ్లు కొనలేమని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ కొట్లాటకు దిగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అష్టకష్టాలు పడిన రాష్ట్ర రైతాంగానికి స్వరాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందించి, సాగుకు అవసరమైన నీటి వసతిని కల్పించి, పెట్టుబడి కోసం రైతుబంధువంటి వినూత్న పథకాలను తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ర్టాన్ని సంపూర్ణ వ్యవసాయ క్షే త్రంగా మలిచింది. రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడి యాసంగి వడ్లు కొనలేమని కొర్రీలు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడినప్పటి నుంచి రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగి కేంద్రానికి మంచి మాటతో చెప్పి చూశారు. కానీ, ససేమిరా ఒప్పుకోక పోవడంతో రైతుల పక్షాన నిలబడిన టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఆదిలాబాద్, ముథోల్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, అజ్మీరా రేఖానాయక్, బాపురావు, మాజీ ఎంపీ నగేశ్, పాడి పరిశ్రమ చైర్మన్ లోక భూమారెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
ఎక్కడి నాయకులు అక్కడే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ధర్నాలకు ఎలా సిద్ధం కావాలనే విషయాలపై ముఖ్య నాయకులతో చర్చించుకున్నారు. ప్రతి నియోజవర్గంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నాలు చేయాలని, ఇందుకు పెద్ద ఎత్తున రైతులను తరలించాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుమతి తీసుకుని మరీ ఆందోళనలకు దిగుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా ఏర్పాట్లను గురువారం టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. సుమారు 2 వేల మంది ధర్నాకు రానున్న నేపథ్యంలో వేదిక నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము ఉన్నారు.
ధర్నాను జయప్రదం చేయండి;మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 11: ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న ధర్నా విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో రైతులకు మద్దతుగా చేపడుతున్న ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో తాను పాల్గొననున్నట్లు మంత్రి తెలిపారు.