
కౌటాల, నవంబర్ 11: పశువులను ఎత్తుకెళ్తున్న ఏడుగురు దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ సుధీంద్ర తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని యాపలగూడకు చెందిన పలువురు రైతులు తమ ఇంటి ఎదుట కట్టివేసిన పశువులను ఎత్తుకెళ్లారని రైతులు ఈ నెల 7న ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి తన పర్యవేక్షణలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్ధే స్వామి ఆధ్వర్యంలో కౌటాల, సిర్పూర్(టీ) ఎస్ఐలు ఆంజనేయులు, రవి కుమార్తో రెండు టీంలు ఏర్పాటు చేశాం. కౌటాల నుంచి సిర్పూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్ , కెరమెరి, జైనూర్ వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. కెరమెరి, జైనూర్ పోలీస్ల సహకారంతో ఈ 10న సాయంత్రం జైనూర్లో పశువుల దొంగలను అరెస్ట్ చేశారు. కెరమెరి మండలం సుల్తాన్గూడకు చెందిన షేక్ అర్ఫత్, షేక్ సల్మాన్, షేక్ సాజీద్, షేక్ ఆవేశ్, బజార్హత్నూర్ మండలం బుతాయి గ్రామానికి చెందిన షేక్ సిమ్ము, హైదరాబాద్ ఫలక్నమాకు చెందిన సయ్యద్ సమీర్తో పాటు మరో మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠాలోని ఇద్దరు దొంగతనానికి ముందుగా గ్రామాల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి పశువులను దొంగలించి ఊరి చివరలో పశువులను ట్రాలీలో ఎక్కించి తీసుకెళ్తారని ఆయన తెలిపారు. యాపలగూడతో పాటు తాటిపల్లి, వాంకిడి, సిర్పూర్ (టీ) మండలాల్లో 6 నెలలుగా వీరు 17 పశువులను దొంగలించారు. వీరి నుంచి రూ. లక్షా 14 వేలు, ట్రాలీ, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన కౌటాల సీఐ బుద్దే స్వామి, కౌటాల, సిర్పూర్(టీ) ఎస్ఐలు ఆంజనేయులు, రవి కుమార్ను అభినందించారు. వీరితో పాటు కౌటాల కానిస్టేబుల్ ఉద్దల్, హోంగార్డు మోతీరాం, కెరమెరి కానిస్టేబుల్ ప్రేం సింగ్, హోం గార్డు ఉత్తంకు నగదు రివార్డును అందజేశారు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, గ్రామంలో దుకాణాల ఎదుట అమర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ ఉన్నారు.