హాజీపూర్, అక్టోబర్ 11 : జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీశాఖ అధికారి శివాణి డోగ్రె, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. బ్లాక్ ప్లాంటేషన్, అవని, కమ్యూనిటీ ప్లాంటేషన్‌తో పాటు హరిత వనాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎకరానికి 4 వేల మొక్కల చొప్పున 242 ఎకరాల్లో మొక్కలను పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 20 లక్షలు, పురపాలక శాఖకు 6.81 లక్షలు, జిల్లా పరిశ్రమల శాఖకు లక్ష మొక్కలు నాటేలా కృషి చేశామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, చర్చీల ఆవరణలో మొక్కలను నాటి, ట్రీగార్డులు, జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా అటవీ శాఖ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
నెన్నెల, అక్టోబర్ 11: కొవిడ్ టీకాలను వేయడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని వైద్య శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ భారతీ హోళికేరి హెచ్చరించారు. సోమవారం నెన్నెల, జెండావెంకటాపూర్‌లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. మండలంలో టీకాలు వేసే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సర్పంచ్ తోట సుజాత తెలిపారు. జెండావెంకటాపూర్లోని కేంద్రానికి వెళ్లి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొదటి, రెండో డోసు తీసుకోని వారికి రేషన్, పింఛన్ ఇవ్వబోమని చెప్పాలని అన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, జెండావెంకటాపూర్ సర్పంచ్ లక్ష్మి పాల్గొన్నారు.