
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఎదులాపురం,సెప్టెంబర్11: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఆదిలాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రజక సంఘం నాయకులతో ఎమ్మెల్యే ర్యాలీగా వచ్చి రిమ్స్ ఎదుట ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడారు. రజకుల సమస్యల పరిష్కారానికి 108 వాహనంలా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ కుల వృత్తులకు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. రజక సంఘాలను ఆదుకునే దిశగా 250 యూనిట్ల కరెంటును ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కల దత్తు, కౌన్సిలర్ భరత్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు లంక రాఘవులు, అన్నమొల్ల కిరణ్, మంజుల, సురేందర్, బొజ్జ ఆశన్న ఉన్నారు.
నివాళి..
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 11: తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరనారి చాకలి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని లక్కారంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తి గా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసి చారులత, ఉప సర్పంచ్ కోల సత్తన్న, జీవవైవిధ్య జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, రజక సంఘం డివిజన్ అధ్యక్షుడు మరికంటి నారాయణ, అశోక్, సత్తన్న, రవి నాయకులు మోతె రాజన్న, మారపాక రాజన్న, గంట విజయ్, గొల్లపెల్లి శ్రీనివాస్, సీపతి లింగా గౌడ్, భూమన్న, లక్ష్మణ్, సోనేరావు, వినాయక్ పాల్గొన్నారు.