
సోన్, సెప్టెంబర్ 11: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృతోత్సవ్’లో భాగంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో కన్యాకుమారి నుంచి రాజ్‌ఘాట్ (ఢిల్లీ) వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీ జిల్లాకు చేరింది. జిల్లా సరిహద్దు సోన్ బ్రిడ్జి వద్ద నిర్మల్ జిల్లా పోలీసులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ చేపట్టిన వారికి జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. సోన్ నుంచి నిర్మల్ పట్టణం వరకు పోలీస్ కాన్వాయ్ మధ్య జిల్లా కేంద్రంలోని మున్నూరుకాపు సంఘ భవనానికి చేరింది. ఆదివారం ఆదిలాబాద్‌కు ర్యాలీ సాగనుంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు ఎస్పీ రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, సీఐలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, ఆర్ఐలు వెంకటి, కృష్ణం ఆంజనేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఆదిలాబాద్‌కు
ఎదులాపురం,సెప్టెంబర్ 11: అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ చేపట్టిన సైకిల్ యాత్ర ఆదిలాబాద్ జిల్లాకు ఆదివారం చేరుకుంటుందని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మావల జాతీయ రహదారి వద్ద స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరు కానున్నట్లు తెలిపారు. జనార్దన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో యాత్రికులకు సన్మానం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎంపీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లను ఆహ్వానించినట్లు తెలిపారు.