కాగజ్‌నగర్ టౌన్ / ఆసిఫాబాద్ టౌన్ / సిర్పూర్ (టి) / గర్మిళ్ల, ఆగస్టు 11: జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశపరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2972 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 1967 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలకు వచ్చే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి కేంద్రాలకు అనుమతించారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 623 మంది విద్యార్థులకు గాను 410 మంది హాజరయ్యారు. 213 మంది గైర్హాజరైనట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జనరల్ ఎగ్జామినేషన్స్ ఉదయ్‌బాబు తెలిపారు. సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేయ గురుకుల బాలికల విద్యాలయంలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 133 మంది విద్యార్థులకు గాను 102 మంది విద్యార్థులు హాజరయ్యారు. 31 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ సంధ్యా రాణి తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాల్లో 831 మంది విద్యార్థులకు గాను 579 మంది హాజరయ్యారు. 252 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.వెంకటేశ్వర్లు సందర్శించారు. పరీక్షా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.