
ఎదులాపురం, నవంబర్ 10 : స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలను ప్రశాంతంగా, ప్రవర్తన నియమావళిని అనుసరించి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో మండలి ఎన్నికల నిర్వహణపై బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్లకు పంపించామన్నారు. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేస్తామని, 16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26 వరకు నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు ఆయా జిల్లాల కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా, అదనపు కలెక్టర్లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, సమన్వయంతో, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారని పేర్కొన్నారు. పో లింగ్కు అనువైన కేంద్రాలను గుర్తించాలని సూచించా రు. జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో స మావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల ఏ ర్పాట్లపై వివరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, కొవిడ్ మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రవర్తన నియమావళిని పాటి స్తూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించుకునేలా ముందస్తు అనుమతులు నిబంధనల మేరకు జారీ చేయాలని సూచించారు. వీసీలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజన్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్టీవో రాజేశ్వర్, జడ్పీసీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియా పాల్గొన్నారు.