
ఎదులాపురం, జనవరి 10 : కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని తన చాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు, పల్స్ పోలియోపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు ప్రబలకుండా వైద్య, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు ముందస్తు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. షాపింగ్ మాల్స్, రైతు బజార్, సినిమా థియేటర్లు, దుకాణాలు ,వీధి వ్యాపారుల కూడళ్లలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారులు వారి పరిధిలోని దుకాణాల్లో నో మాస్క్- నో ఎంట్రీ అనే విధంగా బోర్డులను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు 98 శాతం, రెండో డోసు 80 శాతం మందికి, 45 శాతం 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు టీకా వేశామని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలన్నారు. తొమ్మిది నెలల ముందు రెండో డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారు ఈ టీకా తీసుకోవచ్చని పేర్కొన్నారు.
23 నుంచి పల్స్ పోలియో
పల్స్ పోలియో ఈ నెల 23న బూత్ స్థాయిలో 24, 25 తేదీల్లో ఇంటింటికీ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాలో 78,260 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నారు. అందుకు జిల్లా వ్యాప్తంగా 710 బూత్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 1.08లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో వందశాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్స్ పోలియోకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. సమవేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, మెడికల్ ఆఫీసర్ అతుల్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజేశ్వర్, అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌రావు, వినోద్ కుమార్, ఆర్డీవో రాజేశ్వర్, అదనపు జిల్లా వైద్యాధికారి సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.