
కుంటాల, జనవరి 10 : రైతుబంధు పథకంపై ఏర్పాటు చేసిన ప్రతిభా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి సోమవారం బహుమతులు అందజేశారు. మండల స్థాయిలో రైతుబంధు పథకం అమలుపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా.. ఆదర్శ పాఠశాలకు చెందిన సరస్వతి ప్రథమ బహుమతి, జడ్పీ హైస్కూల్, కల్లూర్కు చెందిన నర్సింహ ద్వితీయ బహుమతి, కుంటాల మోడల్ స్కూల్కు చెందిన నందిని తృతీయ బహుమతులు సాధించారు. చిత్రలేఖనంలో అంబకంటికి చెందిన సరస్వతి ప్రథమ, కుంటాలకు చెందిన గాయత్రి ద్వితీయ, పెంచికల్పాడ్కు చెందిన రుక్మాజీ మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు స్థానిక రైతు వేదికలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులను అందజేశారు. కుంటాల గ్రామానికి చెందిన వృద్ధ రైతు జక్కుల ముత్యాలును ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు. ఏడీఏ వీణ, జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, ఆర్బీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆత్మ చైర్మన్ అశోక్ రెడ్డి, ఏవో సోమలింగారెడ్డి, సర్పంచ్ సమత పాల్గొన్నారు.
రైతుబీమా చెక్కు అందజేత..
కుంటాల మండలం అందకూర్ గ్రామానికి చెందిన రైతు కొండూరు గంగన్న ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల రైతుబీమా మంజూరు చేసింది. ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి బాధిత కుటుంబానికి కుంటాలలో ఆ చెక్కును అందజేశారు. ఆపదలో రైతుబీమా చెక్కును అందజేసిన ప్రభుత్వానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ దాసరి కిషన్, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఎంపీటీసీ దాసరి మధు, ఏడీఏ వీణ, ఏవో సోమలింగారెడ్డి, ఏఈవోలు శ్రీధర్, మహేశ్, ప్రగతి, పార్టీ కన్వీనర్ పడకంటి దత్తు పాల్గొన్నారు.