
దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు అమలు
అభాగ్యులకు వరంలా ‘ఆసరా’
రైతుబీమా, రుణమాఫీ, పెట్టుబడి సాయంతో తీరిన బాధలు
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’
డబుల్ బెడ్రూం ఇండ్లతో నిరుపేదలకు నీడ
ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిర్మల్ టౌన్/ నిర్మల్ అర్బన్, అక్టోబర్ 9 : సకల జనుల హితమే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ సర్కారు కనీవినీ ఎరగని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. పని చేయలేని దీనులు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ‘ఆసరా’గా నిలుస్తున్నది. గూడులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇచ్చి సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలతో పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయల కట్నం పెడుతున్నది. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీలాంటి స్కీంలతో అన్నదాతలకు భరోసానిస్తున్నది. గొల్లకుర్మలకు గొర్రెలు, ముదిరాజ్‌లకు చేపలు, పేదింటి విద్యార్థులకు నాణ్యమైన విద్య.. ఇలా పలు ప్రయోజనాలు కల్పిస్తూ, అన్ని వర్గాలకూ ప్రభుత్వమున్నదనే ధైర్యం కల్పిస్తున్నది.
రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యే యంగా తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుండడంతో అన్ని వర్గాలకు మేలు జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఇప్పటి వరకు పాలన కొనసాగిస్తున్నది. అన్ని వర్గాలకు, కులవృత్తులకు చేయూతనిచ్చింది. పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. లక్షా 116 అందించింది. ఆసరా పింఛన్ల ద్వారా అభాగ్యులకు అండగా నిలుస్తున్నది. రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నది. సాగుచేసిన పంటలను దళారుల పాలు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మద్దతు ధరతో పంటను కొనుగోలు చేస్తున్నది.
అభాగ్యులకు ఆసరాగా..
ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,016లు చెల్లిస్తున్నది. దివ్యాంగులు, రూ. 3016ల చొప్పున అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 65,798 మంది లబ్ధిదారులున్నారు. వీరికి రూ.17.16 కో ట్లను ప్రతి నెలా అందజేస్తున్నది. నిర్మల్ జిల్లాలో 1,39,391 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ. 30.93 కోట్లు అందజేస్తున్నారు.
పంట రుణమాఫీ
పంట రుణమాఫీ పథకం కింద జిల్లాకు ఎక్కువగా లబ్ధి చేకూరింది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.50 వేలకు లోపు రుణం తీసుకున్న 9,371 మంది రైతులకు సంబంధించిన రూ.33.39 కోట్లు మాఫీ చేశారు. నిర్మల్ జిల్లాలో రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న 14,217 మంది రైతులకు రూ.50.05 కోట్లు మాఫీ చేశారు.
పెట్టుబడి సాయం..
ఆదిలాబాద్ జిల్లాలో రైతుబంధు పథకంలో భాగంగా ప్రతి సీజన్లో 1,47,026 మంది రైతులకు రూ. 276.44 కోట్ల పంటపెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. నిర్మల్ జిల్లాలో సుమారు 1,67,000 మందికి రూ. 212 కోట్ల పెట్టుబడి సాయం అందుతున్నది.
రైతుకు ధీమా.. బీమా..
రైతు కుటుంబానికి ప్రభుత్వం బీమా చేయించి ధీమాగా నిలిచింది. రైతు బీమా కింద ఆదిలాబాద్ జిల్లాలో 99,910 మంది అర్హులను గుర్తించి వారికి బీమా వర్తింపజేశారు. ఇప్పటి వరకు 1416 కుటుంబాలకు రూ. 70.80 కోట్లు చెల్లించారు. నిర్మల్ జిల్లాలో 492 కుటుంబాలకు రూ. 24.05 కోట్లు రైతు బీమా డబ్బులు అందజేశారు.
కేసీఆర్ కిట్లు
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరుపుకున్నవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు 13 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే.ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాలో 20వేల మందికి కేసీఆర్ కిట్లు అందించారు. నిర్మల్ జిల్లాలో 20,463 ప్రసవాలు నమోదు కాగా, 19,599 మందికి కిట్లు అందించారు.
ఆడబిడ్డకు సర్కారు కట్నం …
ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి, బడుగు తల్లిదండ్రులకు కొండంత అండగా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా ఒక్కొక్కరి పెళ్లికి రూ. 100116 చొప్పున 18,942 పేదకుటుంబాలకు రూ.162 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. నిర్మల్ జిల్లాలో కల్యాణలక్ష్మి ద్వారా 5,405 మందికి, షాదీముబారక్ ద్వారా 1,184 మందికి ఆర్థిక సాయం అందించారు.
పేదింటి కల సాకారం
ఆదిలాబాద్ జిల్లాలో 3429 మంజూరు కాగా, 518 మందికి పంపిణీ చేశారు. మిగతావి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 6,686 డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించగా, ఇందులో 6,241 గృహాలకు పరిపాలన అనుమతులు వచ్చాయి. 6,156 గృహాలకు టెండర్లు పిలవగా, ఇందులో 4,808 ఆమోదం పొందాయి. 2,342 గృహాలు పూర్తయ్యాయి.
దళితులకు భూ పంపిణీ..
భూ పంపిణీలో ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. రూ.206.66 కోట్లతో 1832 మంది భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు 4675 ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. వీరికి మొదటి పంట పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింప చేస్తున్నది ధరణి పోర్టల్‌లో 7 వేలకు పైగా భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిర్మల్ జిల్లాలో 503 మందికి 1342.11 ఎకరాలు పంపిణీ చేశారు.
పేద పిల్లలకు కార్పొరేట్ విద్య
ప్రత్యేక రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఇంగ్లిషు మీడియంలో కార్పొరేట్ విద్యను అందిస్తున్నది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నది. పేద విద్యార్థులకు మంచి భోజనంతో పాటు మంచి చదువులు అందుతున్నాయి.
ఇంటింటికీ తాగునీరు.
జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కారమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో 1231 గ్రామాల్లోని ఇంటింటికీ రక్షితమైన నీరు అందుతున్నది. నిర్మల్ జిల్లాలో ఇంటింటికీ తాగు నీరందించేందుకు లక్షా 49 వేల 591 కనెక్షన్లు మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు లక్షా 48 వేల 91 నల్లాలు బిగించి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారు.
అన్నితీర్ల ఆదుకున్నరు..
నిర్మల్ టౌన్, అక్టోబర్ 9 : ఈమె నాలం లక్ష్మి. భర్త పేరు గజ్జారాం. కుంటాల మండలం ఓలా గ్రామంలో హోటల్‌ను నడుపుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. సొంత ఊరిలోనే ఎకరంన్నర పొలం ఉండడంతో ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ. 15 వేలు లబ్ధి చేకూరుతున్నది. పొలంలో బోరు మోటరు ఉండడంతో 24 గంటల ఉచిత కరెంటుకు వినియోగించుకున్నారు. భార్య లక్ష్మి బీడీలు చుడుతుండడంతో ప్రతినెలా రూ. 2,016 పెన్షన్ వస్తున్నది. పెద్ద కూతురు అర్చన పెండ్లి మూడేండ్ల క్రితం చేయగా, కల్యాణలక్ష్మి కింద రూ. 50 వేలు, రెండో కూతురు హారిక పెండ్లి గతేడాది చేయగా, రూ. 1,0116 సాయం అందింది. ఇద్దరు కూతుళ్లు డెలివరీ సమయంలో కేసీఆర్ కిట్‌తో పాటు ఆర్థిక సాయం కూడా పొందారు. గజ్జారాం తండ్రి నాలం హన్మాండ్లు వీరి వద్దనే ఉంటున్నాడు. అతడికి రూ.2,016 వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. చిన్న కూతురు గురుకులాల్లోనే ఉచిత విద్యను అభ్యసించింది. సీఎం కేసీఆర్ సార్ మా కుటుంబాన్ని అన్నితీర్ల ఆదుకున్నడని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారోళ్లే మమ్ముల ఆదుకుంటున్రు..
నా పేరు దుర్గం గౌరుబాయి. నాది బెజ్జూర్ మండలం కుకుడ గ్రామం. నేను ముసలిదాన్నయిన. నాకు నెల నెలా 2,016 రూపాల పింఛన్ వస్తున్నది. నా పేరిట రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు కింద యాడాదికి రూ.25 వేలు ఇస్తున్నరు. ఇంతకు ముందు ఏ సర్కారోళ్లు గిట్ల పట్టించుకోలె. రైతులను ఆదుకున్నది లేదు. కేసీఆర్ సారుతోనే మంచి పనులైతున్నయ్. ఎవరికి ఏది అవసరమో గది ఇస్తున్నడు. నా ముగ్గురు కొడుకులకు రైతుబంధు కింద లక్షా 30 వేల రూపాలు వస్తున్నయ్. పెద్దోడు దుర్గం లాంచు పేరున ఐదెకరాలు ఉంది. రూ.50 వేలు వస్తున్నయ్. రెండో కొడుకు దుర్గం మల్లయ్య పేరు మీద ఐదెకరాలు ఉంది. రూ.50 వేలు ఇస్తన్రు, మూడో కొడుకు దేవాజీ పేరు మీద మూడు ఎకరాలు ఉన్నది. ఆనికి రూ.30వేలు వస్తున్నయ్. గీ సర్కారోళ్లే మమ్ముల అన్నితీర్ల ఆదుకుంటున్రు.
రెండు పథకాలన్నా అందినయ్..
మా కొలాం గిరిజన గ్రామంల 310 కుటుంబాలున్నయ్. అందులో ప్రతి కుటుంబానికి కనీసం రెండైనా సర్కారు పథకాలు అందుతున్నయ్. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, సీఎం రిలీఫ్ ఫండ్, రైతుబంధు, రైతుబీమా ఇట్ల ప్రతి పథకం అమలవుతున్నది. ఇగ పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, ఊర్లె పచ్చదనం పరిశుభ్రతతో మంచిగ తయారైంది.
కుటుంబ సభ్యులందరికీ లబ్ధి
నిర్మల్ టౌన్, అక్టోబర్ 9 : ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిపేరు అయిటి రమేశ్. కాంట్రాక్టు ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఆపరేషన్ చేయించుకోగా రూ.లక్ష వరకు ఖర్చు అయ్యింది. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.54,154 ఆర్థిక సహాయం అందింది. కుంటాల మండలం ఓలా గ్రామంలో ఇతడికి మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. యేటా రైతుబంధు పథకం కింద ఎకరానికి పది వేల రూపాయలు అందుతున్నవి. 2018కి ముందు దక్కన్ గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకోగా, ప్రభుత్వం మాఫీ చేసింది. పొలంలో బోరు మోటరు ఉండడంతో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటుతో పంటలను సాగుచేస్తున్నాడు. ఆయన భార్య సంగీత బీడీలు చూడుతూ చేదోడువాదోడుగా ఉంటున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రూ.2016 బీడీల పింఛన్ ఆమెకు వస్తున్నది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. సర్కారు విద్యాల యాల్లో రూపాయి ఖర్చు లేకుండా చదువుకుంటు న్నారు. కుటుంబంలో ని సభ్యులందరికీ ప్రభుత్వ సాయం అందడంతో ఆనందంగా ఉన్నారు.