
13 నుంచి మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వాసులకు టీకా
వ్యాక్సిన్ కేంద్రాల పెంపు.. విద్యాసంస్థల సిబ్బందికి కూడా..
ఆదిలాబాద్, సెప్టెంబరు 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నియంత్రణలో ఉండగా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ మొదటి, రెండో డోస్ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థల్లో వంద శాతం వేసేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం మరో ఐదు కేంద్రాలను పెంచారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నందున జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఈ నెల 13 నుంచి అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. 18 ఏండ్లు నిండిన వారు టీకాలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో వైద్యశాఖ అధికారులు తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో కరోనా నియంత్రణలో ఉంది. జిల్లాలో రోజూ ఒకటి, రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అనుమానితులకు వ్యాధి నిర్ధారణలో భాగంగా ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వే జరుగుతుండగా, వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రజలు సైతం మాస్కులు ధరిస్తూ, భౌతికదూ రం పాటించడం లాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు. జిల్లాలో మండలాల్లో జరిగే సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు గ్రా మాల్లో వ్యాక్సిన్ వేసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని, టీకా కేంద్రాల వివరాలు సైతం సూచించాలని అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
సరిహద్దు గ్రామాల ప్రజలకు టీకా
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ అవసరాల కోసం మహారాష్ట్రకు వెళ్లి వస్తుంటారు. అక్కడివారు సైతం జిల్లాలోని తమ బంధువుల ఇళ్లకు, ఇతర పనులు, ఉపాధి కోసం ఇక్కడికి వస్తుంటారు. అక్కడ కేసులు పెరుగుతుండడంతో జిల్లా సరిహద్దు గ్రామాల్లో అర్హులందరికీ టీకాలు వేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లావ్యాప్తంగా 38 సరిహద్దు గ్రామాలను గుర్తించిన అధికారులు ఈ నెల 13 నుంచి ఆరు రోజుల పాటు వ్యాక్సిన్ ఇచ్చేలా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో టీకా కార్యక్రమం చేపట్టనున్నారు. విద్యాసంస్థలు ప్రారంభం కాగా వాటిల్లో సైతం ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బందికి వందశాతం వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 29 టీకా కేంద్రాలు ఉండగా, అదనంగా మరో ఐదు సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిల్లో డిగ్రీ, ఇతర విద్య చదువుతున్న 18 ఏళ్లు నిండిన వారికి సైతం ఇక్కడి టీకాలు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, నలందా కళాశాల, బోథ్‌లో వాగ్దేవి కాలేజీ, ఉట్నూర్‌లో ఫూలాజీబాబా కళాశాలల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు.
ఖైదీలకు వ్యాక్సినేషన్
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్9 : పట్టణంలోని సబ్‌జైలులో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ సహకారంతో గురువారం 27 మంది ఖైదీలకు, జైలు సిబ్బంది 11 మంది కుటుంబ సభ్యులకు టీకాను అందించారు. ఈ సందర్భంగా సబ్ జైలర్ చిరంజీవి మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రమణ, సుజాత, సిబ్బంది శివకుమార్, బాలయ్య, రమేశ్, జితేందర్, రిజ్వాన్, అఖిలేశ్, కమలాకర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.