
కాగజ్‌నగర్ డివిజన్లో రెండు రోజుల పాటు సందడి
వెనుదిరిగిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు
కెమెరాల్లో అరుదైన జ్ఞాపకాలతో తిరుగుపయనం..
అనూహ్య స్పందనపై అధికారుల సంతోషం
కాగజ్‌నగర్ రూరల్/ బెజ్జూర్/పెంచికల్పేట్/ సిర్పూర్(టి), జనవరి 9: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ డివిజన్లో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన బర్డ్‌వాక్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. సుమారు 100 మందికి పైగా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు రెండు రోజుల పాటు కాగజ్‌నగర్, బెజ్జూర్, పెంచికల్‌పేట సిర్పూర్(టి) రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కెమెరాలు చేతబట్టి కలియదిరిగారు. అటవీ అధికారులతో కలిసి ఒర్రెలు, వాగులు దాటుతూ ఎన్నో అరుదైన జాతుల పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. ప్రకృతిని ఆస్వాదించారు. కడంబా అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ రాములయ్య, జిల్లా ఫారెస్ట్ అధికారి శాంతారాం, ఎఫ్‌డీవో విజయ్ కుమార్ పర్యటించి పక్షులను వీక్షించారు. బెజ్జూర్ రేంజ్ పరిధిలోని మత్తడి, సిద్దప్ప గుహలు, గ్రాస్ప్లాంట్, సమ్మక్క సారక్క స్పాట్, గొల్లబాయి చెరువు, తదితర ప్రాంతాల్లో 21 మంది పర్యటించారు. ఈ సందర్భంగా బెజ్జూర్ను ఎవర్గ్రీన్ ఫారెస్ట్‌గా వారు అభివర్ణించారు. పెంచికల్పేట్ రేంజ్లో 25 మంది పక్షి ప్రేమికులు ఎఫ్ఆర్వో వేణుగోపాల్ ఆధ్వర్యంలో పెద్దవాగు, బొక్కివాగు ప్రాజెక్టు, ఉచ్చమల్లివాగు ప్రాజెక్టు వద్దకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. సిర్పూర్(టి) అటవీ రేంజ్ పరిధిలోని సిర్పూర్(టీ), లింబుగూడ, చీలపల్లి, భూపాలపట్నం, మేడిపల్లి, ఇటుకలపాడు అటవీ ప్రాంతాల్లో కూడా పర్యటించి, కెమెరాల్లో పక్షుల చిత్రాలు తీశారు. అనంతరం అన్ని ప్రాంతాల నుంచి కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. రేంజ్ అధికారి దయాకర్, డీఆర్వోలు శీలానంద్, సవిత, సెక్షన్ అధికారులు ప్రసాద్ రావు, మోహన్, ఎఫ్‌బీవోలు, శ్రీధర్, అనిత, సంఘదీప్, ముత్యం, మరళి, వంశీ, సత్యనారాయణ, వెంకటేశ్, డిప్యూటీ ఎఫ్ఆర్వో రమాదేవి, ప్రభాకర్,సుధాకర్, ఎఫ్ఎస్వో జగన్మోహన్గౌడ్ పాల్గొన్నారు.
స్పందన అమోఘం: సీసీఎఫ్ రామలింగం
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిర్వహించిన బర్డ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఔత్సాహికుల నుంచి వచ్చిన స్పందన అమోఘమని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రామలింగం అన్నారు. సిర్పూర్(టి) మండలంలోని వెంపల్లిలోని టింబర్ డిపోలో బర్డ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతా లు పక్షులకు ఆవాస కేంద్రాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహికులకు సర్టిఫికెట్తో పాటు టీ షర్ట్‌లను అందజేశారు.