
జిల్లా ఏర్పాటు తర్వాత అభివృద్ధిలో ముందుకు..
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
రైతుబంధు సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దిలావర్పూర్ జనవరి 9 : నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయని, మార్చి తర్వాత శంకుస్థాపనలు చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. జిల్లా ఏర్పాటు తర్వాత నిర్మల్ అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని, వచ్చే ఏడాది నుంచే కళాశాలను ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు రైతులతో కలిసి రైతువేదిక వద్దకు ట్రాక్టర్ నడుపుతూ వెళ్లారు. అక్కడ రైతుబంధు, రైతుబీమాతో పాటు సంక్షేమ పథకాలు వివరించేలా ముగ్గులు వేసి మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, వాణిజ్యపరంగా నిర్మల్ జిల్లా అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని రూ.350 కోట్లతో ఇప్పటికే ఏరియా, ప్రసూతి దవాఖానలను కొత్తగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. మెడికల్, నర్సింగ్ కళాశాలలను ప్రారంభిస్తే ఐదేళ్లపాటు 150 మంది విద్యార్థులకు సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు. నర్సింగ్‌లో మరో 100 మంది విద్యార్థులకు అవకాశం దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా సంక్షేమ పథకాలు తెచ్చినట్లు చెప్పారు.
వాటిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా..?’ అని మంత్రి ఆ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయబోమని ఢిల్లీలోని పెద్దలు చెప్తుంటే.. గల్లీల్లోని నాయకులు అన్నదాతలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల నాయకులు వస్తే వారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు తీసుకువచ్చారా అని నిలదీయాలని రైతులకు సూచించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు దిలావర్పూర్ సమాఖ్య భవనం ఏర్పాటుకు నిధులు మంజూరుచేయాలని వినతి పత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన ఆయన వెంటనే అధికారులను పిలిచి, స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు తీసుకువచ్చిన ప్యాకేజీ 27 పనులు త్వరలోనే పూర్తవుతాయని, దీంతో 50 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయన్నారు. అనంతరం కళాకారుల కళాజాత ప్రదర్శన ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద, నిర్మల్ రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, ఎంపీటీసీలు పాల్దే అక్షర, అనిల్, మండల కోఆప్షన్ సభ్యులు అన్వర్‌ఖాన్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు దనే రవి, దనే నర్సయ్య, సర్పంచ్‌లు గంగారెడ్డి, కదిలి, కాల్వ ఆలయ చైర్మన్ భుజంగ్రావ్పటేల్, చిన్నయ్య, అత్మ డైరెక్టర్ గుణవంత్‌రావ్, సప్పల రవి, స్వామిగౌడ్, నిర్మల్ సహకార సంఘం డైరెక్టర్ తమ్మల ముత్యం, ఎంపీడీవో మోహన్, మండల వ్యవసాయాధికారి స్రవంతి, ఎంపీవో అజీజ్‌ఖాన్, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, ఆర్ఐ సంతోష్‌కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
సోన్‌లో ఎడ్లబండ్లపై ర్యాలీ..
సోన్, జనవరి 9 : సోన్‌లో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఆయనకు రైతులు ఘన స్వాగతం పలికారు. పంచాయతీ నుంచి రైతు వేదిక వరకు ఎడ్లబండిపై మంత్రి ర్యాలీగా తరలివచ్చారు. సోన్ జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ విద్యార్థులతో పాటు మహిళా సంఘాల సభ్యులు వేసిన ముగ్గులను ఆయన పరిశీలించి అభినందించారు. మాదాపూర్ ఏఈవో సురత్ ప్రియ మక్కలతో కేసీఆర్ ముఖ చిత్రం వేసి అందరినీ ఆకర్శించారు. మంత్రి పరిశీలించి, ఏఈవోను అభినందించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు సీఎం కేసీఆర్, మంత్రి అల్లోలకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతు బాంధవుడు కేసీఆర్ జిందాబాద్ అంటూ సంబురాలు చేసుకున్నారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అల్లోల కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. త్వరలో ఐదు రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. రూ.10 సాయం చేయని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, అలాంటి వారిని ప్రజలు క్షమించబోరని తెలిపారు. దేశంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా గాలి వీస్తున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలవడంతో దేశ ప్రజలు కేసీఆర్ సంక్షేమ పథకాలపై చర్చించుకుంటున్నారన్నారు. కాగా, రైతుబంధు సంబురాల్లో భాగంగా కేజీబీవీ ఇద్దరు విద్యార్థులు కేసీఆర్ సంక్షేమ పథకాలపై ఇంగ్లిష్‌లో స్పీచ్ ఇవ్వగా, వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ కేజీబీవీ ఏర్పాటు చేయడం వల్లే విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడగలుగుతున్నారని పేర్కొన్నారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన సాంస్కృతిక సారధి కళాకారులు నాగరాజు, మిమిక్రీ సుధాకర్, సుదర్శన్, జగదీశ్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సోన్ సర్పంచ్ టీ వినోద్, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, మండల కన్వీనర్ మోహినొద్దీన్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఎంపీటీసీ లింగవ్వ, ఏవో ప్రవీణ్‌కుమార్, ఏఈవోలు సురత్ ప్రియ, అంబాజీ, రజిని, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎల్చల్ గంగారెడ్డి, విలాస్, నాయకులు బర్మ రాజనర్సయ్య, వెంకాయిగారి శ్రీనివాస్‌రెడ్డి, అంకం శ్రీనివాస్, బండి లింగన్న, జగన్, అబుద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.