
ఎనిమిదో విడుత హరితహారానికి సన్నాహాలు
1.39 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక
కొనసాగుతున్న నర్సరీల పనులు
దస్తురాబాద్, జనవరి 9 : పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడేలా చేపట్టిన హరితహారం విజయవంతానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఎనిమిదో విడుత కార్యక్రమంలో భాగంగా మండలంలో 1.39 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ చేపట్టారు. ఇందులో ఎర్రమట్టి, సేంద్రియ ఎరువులను కలుపుతున్నారు. పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచి ఇంటింటికీ సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాలను హరితమయం చేసేందుకు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వచ్చే వానకాలంలో హరితహారం లక్ష్యాన్ని సాధించే దిశలో ముందుకు వెళ్తున్నారు. మండలంలో 1.39 లక్షల మొక్కలు నాటేందుకు నర్సరీలను సిద్ధం చేస్తుండగా, ప్రతి నర్సరీకి 13 వేల మొక్కల చొప్పున పెంచాలనే లక్ష్యంతో పనులు జోరుగా సాగుతున్నాయి. నర్సరీలో మట్టి పోసి బ్యాగులు నింపడం, విత్తనాలను పెట్టడం వంటివి వేగవంతం చేశారు. రోడ్ల వెంట, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్ల ఆవరణ, ఖాళీ స్థలంలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోకున్నారు. జూన్ నాటికి నర్సరీల్లో మొక్కలు పెంచి ఇంటింటికీ సరఫరా చేసేలా సన్నద్ధమవుతున్నారు.
పెంచుతున్న మొక్కలు ఇవే..
ఈ సారి నీడనిచ్చే మొక్కలు కాకుండా పూలు, పండ్ల మొక్కలు కూడా పెంచుతున్నారు. టేకుతో పాటు జామ, దానిమ్మ, నిమ్మ, సీతాఫలం, చింత, కరివేపాకు, ఉసిరి, మునగ, తులసి, గన్నేరు, మందారం, గుల్మోర్, గులాబీ, కానుగ, రావి, మలబార్ వేప, వెలగ ఇతరాత్ర మొక్కలను పెంచడంపై దృష్టి సారించారు. కాగా.. నర్సరీ స్థలానికి ప్రతి నెలా రూ.2 వేలు అద్దె చెల్లించనున్నారు. మొక్కలకు నీళ్లు పోయడానికి, కాపలా ఉండే వనసేవక్లకు ప్రతినెలా రూ.3 వేల వేతనం ఇవ్వనున్నారు. సొంతంగా స్థలం ఇచ్చిన రైతు నిర్వహణ చేస్తే, ఈ మొత్తం చెల్లింపులు సదరు ఖాతాలో జమకానున్నాయి. మిగతా కూలీలు చేసిన పనులకు వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేస్తారు. చేసిన ప్రతి పనికీ వారం వారం మస్టర్ నిర్వహణ, ఎంబీ రికార్డుతో ఆన్లైన్ ద్వారా ఈ నగదు చెల్లింపుల ప్రక్రియ చేస్తామని ఈజీఎస్ అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు.
పకడ్బందీగా నర్సరీల పనులు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేశాం. మండలానికి ఇచ్చిన మొక్కల పెంపకం లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపడుతున్నాం. మట్టి తెప్పించడం, జల్లెడ పట్టడం, కవర్లలో మట్టి నింపడం, విత్తనాలను పెట్టే పనులు సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు, వన సేవకులతో పనులు చేయిస్తున్నాం. వచ్చే వానకాలం నాటికి హరితహారం మొక్కలను సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తున్నాం.