
పళ్లైన నాలుగు నెలలకే మనుమడు ఆత్మహత్య
ఆగ్రహంతో మనుమరాలిని హత్య చేసిన కొడుకు
మనస్థాపంతో తాతా బలవన్మరణం
లింగన్నపేటలో విషాదం
కోటపల్లి, జనవరి 9 : ప్రేమ ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంట జీవితం విషాదాంతమైంది. వీరి మరణం మరొకరి మృతికి కారణమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బొరగళ్ల సౌందర్య-రాళ్లబండి సాయికృష్ణ ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో అప్పటినుంచి వేరే కాపురం పెట్టారు. వారికి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మూడు నెలల క్రితం సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో కొడలికి అండగా ఉండాల్సిన అత్తింటివారు తన కొడుకు మరణానికి సౌందర్య కారణమంటూ కక్ష పెంచుకున్నారు. దీంతో ఈ నెల 3న సౌందర్యను తన మామ కత్తితో నరికి చంపగా.. ఈ ఘటన సంచలనంగా మారింది. నిందితుడు తిరుపతిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు హత్యకు గురికావడంతో ప్రేమ పెళ్లి చేసుకున జంట జీవితం విషాదాంతమైంది. మనమడు ఆత్మహత్య చేసుకోవడం, కుమారుడు తిరుపతి హత్య చేసి జైలుకు వెళ్లనుండడంతో కలత చెందిన తిరుపతి తండ్రి రాజబాబు శనివారం ఉరేసుకున్నాడు. ప్రేమ కారణంగా ముగ్గురు మృత్యు ఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.