
యాసంగిలో ఏజెన్సీ రైతులు బిజీబిజీ
అంతర పంటలుగా 8 వేల ఎకరాల్లో అన్ని రకాలు..
ఎటుచూసినా పచ్చని పంట పొలాలే
ఇంద్రవెల్లి, జనవరి 9 : మండలంలోని రైతులు యాసంగి పంటల సాగుపై దృష్టి సారించారు. తీరొక్క పంటల సాగుతో ముందుకెళ్తున్నారు. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో యాసంగి సాగుపై ఏజెన్సీ రైతులు మొగ్గుచూపే వారు కాదు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో రెండు పంటలు సాగుచేయాలన్న ఆసక్తి పెరిగింది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, సకాలంలో రైతుబంధు డబ్బులు అందించడంతో వ్యవసాయం పండుగలా మారింది. దీంతో ఇంద్రవెల్లి మండలంలోని రైతులు ఏటా రెండు పంటలు పం డిస్తూ ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుతో పెట్టుబడి కోసం తిప్పలు తప్పాయి. రైతుబీమాతో అన్నదాతల కుటుంబాల్లో భరోసా ఏర్పడింది.
పెరిగిన సాగు విస్తీర్ణం..
సాగునీరు అందుబాటులో ఉండడంతో మండలంలో యాసంగి సాగు విస్తీర్ణం ఈసారి గణనీయంగా పెరిగింది. చెరువుల అయకట్టు కింద అన్ని రకాల పంటలను సాగుచేస్తున్నారు. వర్షాకాలంలో సాగుచేసిన సోయాతోపాటు పత్తిని తొలగించి తీరొక్క పంటలు సాగుచేస్తున్నారు. మండలంలోని ధనోరా (బీ), గౌరాపూర్, గిన్నేరా, ముత్నూర్, దస్నాపూర్. మార్కగూ డ, కెస్లాగూడ, మేడంపల్లి, శంకర్గూడ, దేవాపూర్, అంజీ, బి క్కుతండా, ఏమాయికుంట, గలియబాయితండా, అందునాయక్తండా, వడగాం, డోంగర్గాం, మారుతీగూడ, హీరాపూ ర్, ఈశ్వర్నగర్, కెస్లాపూర్, పిట్టబొంగురం, జాలామ్సింగ్తం డా, ఇన్కర్గూడ, వాల్గొండ, పోల్లుగూడ, సాలేగూడ, లాల్టేకిడి, భీంజీతండా, సమాక, చిత్రుగూడ(కెస్లాగూడ) గ్రామాల్లో ఆయా రకాల పంటలు సాగు చేస్తున్నారు. అవి ఇప్పుడు ఏపుగా పెరగడంతో ఎటుచూసినా పచ్చగా దర్శనమిస్తున్నాయి.
సాగుచేస్తున్న పంటలివే..
మండలంలోని రైతులు ఈ యాసంగిలో 8వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వేరుశనగ 3,800 ఎకరాలు, గోధుమ 280, జొన్న 1200, మక్కజొన్న 220, టమాట 150, కంది 2000లతో పాటు అన్ని రకాల కూరగాయలు (ఉద్యానవన పంటలు) 360 ఎకరాలల్లో సాగుచేస్తున్నారు. ఈ సంవత్సరం మండలంలో వానకాలం సీజన్లో పత్తిపంట 25,996 ఎకరాలు, సోయా 5,811 ఎకరాలు, కంది 4,300 ఎకరాలతో పాటు ఇతర పంటలు 2,860 ఎకరాల్లో సాగుచేశారు.
సాగుపై అవగాహన..
రైతులకు వివిధ రకాల పంటల సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఏ సమయంలో ఏ పంట సాగు చేయాలనేది వివరిస్తున్నాం. భూములను దుక్కిదున్నడంతోపాటు విత్తనాలు వేసే పద్ధతులపై తెలియజేస్తున్నాం. పంటలకు ఆశించిన చీడపీడల నివారణ చర్యలపై ముందస్తు సూచనలు చేస్తున్నాం. ఏ పంటకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలనేది ముందుగానే తెలియజేస్తున్నాం. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వ గుర్తింపు పొందినవే కొనుగోలు చేయాలని సూచిస్తున్నాం. సాగులో రైతులకు అన్ని విధాలా చైతన్యం చేస్తూ వ్యవసాయ శాఖ తరఫున అన్ని రకాల సలహాలు, సూచనలు అందిస్తున్నాం.