
నేటి నుంచి బూస్టర్ డోస్
కొవిడ్ ఎదుర్కొనేందుకు సింగరేణి సిద్ధం
డైరెక్టర్ (పా) బలరాం
కొత్తగూడెం సింగరేణి, జనవరి 9 : సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాతో పాటు కార్మికుల సంక్షేమమూ ముఖ్యమేనని డైరెక్టర్ (పా) ఎన్ బలరాం స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సంస్థ వ్యాప్తంగా ఉన్న వైద్య విభాగం సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడారు. గతంలో కూడా కరోనా సమయంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయలేని విధంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య సేవలు అందించామన్నారు. సోమవారం నుంచి 60 ఏండ్లు పైబడిన ఉద్యోగులు, కార్మికులకు రెండు రోజులు బూస్టర్ డోస్ వేయాలన్నారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న దవాఖానల్లో 500కు పైగా సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్లు ఉన్నాయని తెలిపారు. అవసరాన్ని బట్టి 1500 వరకు పెంచుకోవచ్చని పేర్కొన్నారు. సీఎండీ ఆదేశాల మేరకు కొత్తగూడెం, భూపాలపల్లి, రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. అవసరమైన మందులు, ఇంజక్షన్లకు కొరత లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఖర్చు ఎంతైనా వెచ్చించేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నదన్నారు. సింగరేణి ఏరియాల్లో కూడా 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ప్రస్తుతం 40 వేల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 50 వేల కిట్లు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే ఎప్పటికప్పుడు టెస్టులు చేసి, సేవలు అందించాలని సూచించారు.
అవసరమైన వారిని హైదరాబాద్ కార్పొరేట్ దవాఖానలకు రెఫర్ చేయాలన్నారు. గతంలో రూ.71 కోట్లు వెచ్చించి కార్మికులను కాపాడుకున్నామని వాటి వివరాలను వెల్లడించారు. ఇందులో రూ.3.16 కోట్లతో 1,25,250 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్లను కొనుగోలు చేసి, 99,406 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు డైరెక్టర్ చెప్పారు. అలాగే రూ.43 లక్షలతో కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు, కాలేజీలను ప్రత్యేక కొవిడ్ సెంటర్లుగా సిద్ధం చేసి, సేవలు అందించినట్లు తెలిపారు. రూ.84 లక్షలతో క్వారంటైన్ సెంటర్లలో వివిధ రకాల మందులు, పల్స్ ఆక్సీమీటర్లు వంటి 18 రకాల వస్తువులు కలిగిన కిట్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సంస్థ వ్యాప్తంగా దవాఖానలకు రెమ్డెసివిర్, పెవిపిరావిర్ మందులకు రూ.5.55 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. అలాగే రూ.1.28 కోట్లతో 370 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి దవాఖానలకు సరఫరా చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం, భూపాలపల్లి, రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో ఐదు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.3.60 కోట్లు ఖర్చుచేసినట్లు వివరించారు.
కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వైద్య సిబ్బంది సరిపోకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిన 35 మంది వైద్యులు, 126 మంది నర్సులు, 266 మంది సిబ్బందిని నియమించినట్లు, ఇందుకు రూ.2 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. కరోనా వార్డుల్లో బాధితులకు పోష్టికాహారం, శానిటైజర్లు, మాస్కులు, వైద్యులకు పీపీఈ కిట్లు, గ్లౌజుల కొనుగోలుకు రూ.1.50 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అలాగే రూ.3.15 కోట్లతో 300 రకాల అత్యవసర వైద్య సేవల పరికరాలు కొనుగోలు చేశామన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలకు 867 మందిని తరలించినట్లు, ఇందుకు రూ.38 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. సింగరేణీయుల ఆరోగ్యం కోసం ఎన్ని కోైట్లెనా వెచ్చించేందుకు వెనుకాడవద్దని సీఎండీ ఆదేశించారన్నారు. ఆయన సూచనల ప్రకారం సంస్థ వ్యాప్తంగా అన్ని దవాఖానల్లో అవసరమైన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీఎంలు, వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.