
మంచిర్యాల, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించగా, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. కరోనా పరీక్షలు, కేంద్రాలు పెంచింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. నేటి నుంచి ప్రికాషనరీ డోస్ వేసేందుకు సర్వం సిద్ధం చేసింది. స్వీయ రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, సభలు, సమావేశాలపై నిషేధం విధించింది.
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. సోమవారం నుంచి ప్రికాషనరీ డోసు అందించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి కూడా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. కాగా, మూడు డోసులతో ప్రతి రక్షకాలు పెరుగుతాయని, దీర్ఘ కాలిక రక్షణ లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నెల 10 తర్వాత వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని, వ్యాక్సిన్ రెండో డోసు వందశాతం పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు ఇటీవల సూచించారు. రెండో డోసు వేసుకున్న ఆర్నెళ్లకు బూస్టర్ డోసు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన టీనేజర్లకు అక్కడే టీకాలు ఇచ్చేలా వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రయాణ ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి అవగాహన కల్పిస్తూ కొవిడ్ కిట్లను అందిస్తూ, నేరుగా హోం ఐసోలేషన్‌కు పంపిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కృషి చేస్తున్నారు.
సభలు, సమావేశాలు నిషేధం..
కొవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తతే ప్రధాన ఆయుధమని వైద్య, ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, భౌతిక దూ రంతో పాటు మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నది. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించవద్దని, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా పండుగల వేళ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర సర్కారు సూచిస్తున్నది. దవాఖానలో పడకల సామర్థ్యం, అంబులెన్స్, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది.
వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి..
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రధానమని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. మొదటి డోసు ప్రక్రియను వంద శాతం పూర్తి చేసింది. రెండో డోసు కూడా శత శాతం పూర్తి చేసే లా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. బస్టాండ్లు, రైల్లే స్టేష న్లు, రద్దీ ప్రాంతాలతో పాటు ఇతర చోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నది.ఈ నెల 10 తర్వాత నుంచి బూస్టర్ డోస్ ఇచ్చేలా కసరత్తు చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఎంహెచ్‌వో కుమ్రం బాలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.