
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.68 లక్షల మంది పిల్లలు
కొవాగ్జిన్ వేసేందుకు నిర్ణయం.. 28 రోజుల తర్వాత రెండో డోస్
డబుల్ డోస్ పూర్తయిన వారికి వచ్చే వారం నుంచి ప్రికాషనరీ డోస్
ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ముందస్తు నిర్ణయం
సెంటర్ వద్ద ఆధార్, స్టూడెంట్ ఐడీ కార్డు చూపిస్తే టీకా వేసుకునే చాన్స్
నిర్మల్ అర్బన్, జనవరి 2 : కరోనా మహమ్మారి నివారణకు యువకులు, పెద్దలు, మహిళలపై టీకాస్త్రం ప్రయోగించి విజయవంతమైన రాష్ట్ర సర్కారు.. 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకూ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. నేటి (సోమవారం) నుంచి కొవాగ్జిన్ ఇవ్వాలని ఏర్పాట్లు చేసింది. మొదటి డోస్ వేసిన 28 రోజుల తర్వాత రెండో డోస్ వేయాలని ఆదేశాలు రాగా, వైద్య, ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.68 లక్షల మంది పిల్లలు ఉండగా.. వీరికి ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో మాత్రమే టీకా వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇదే సమయంలో వచ్చే వారం నుంచి 60 ఏండ్లు పైబడిన వారితోపాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులకు ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నేటి(సోమవా రం) నుంచి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 నుంచి 18 ఏం డ్లలోపు వారికి కొవాగ్జిన్ వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా రెండు డోసులు వేయనున్నారు. మొద టి డోస్ వేసిన 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నారు. ఈ కేటగిరిలో వాళ్లు పది, ఇంటర్, ఐఐటీ, డిగ్రీ మొదటి సంవత్సరం చదివే పిల్లలే అధికంగా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పెద్దల మా దిరి అన్ని చోట్ల కాకుండా వైద్యులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో మాత్రమే వేయనున్నారు. టీకా వేసుకోవాలనుకునే వారు గతంలో మాదిరిగానే కొ విన్ వెబ్సైట్, ఆరోగ్యసేతు యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నా రు. లేకపోతే నేరుగా ఆధార్, స్టూడెంట్ ఐడీ కార్డు సెంటర్ వద్ద చూపించి టీకా వేసుకోవచ్చు.
ఒమిక్రాన్ నుంచి రక్షణ కోసమే..
కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు పిల్లల వంతు వచ్చింది. ఇప్పటివరకు 18 ఏండ్లపైబడిన వారికి మాత్రమే టీకాలు వేశారు. ఈ కేటగిరి వయసువారికి అన్ని జిల్లాల్లో మొదటి డోస్ దాదాపు వంద శాతం, రెండో డోస్ దాదాపు 60 శాతం పూర్తయ్యింది. ఒమిక్రాన్ వంటి వేరియంట్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లలకు కూడా కరోనా నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో వైద్య, ఆరోగ్య శాఖ శరవేగంగా ఏర్పాట్లు చేసింది. ఇందుకు అందుబాటులో ఉన్న కొవాగ్జిన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో ప్రారంభించిన తర్వాత 50 ఏండ్లు పైబడిన వారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చి టీకాలు వేశారు. ఈ క్రమంలో చివరిగా 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ ప్రతిపాదన మేరకు 12 నుంచి 18 ఏండ్లలోపు ఉన్న పిల్లలకు కూడా టీకాలు వేయాలని మొదట నిర్ణయించారు. ఆ తర్వాత 15-18 ఏండ్లలోపు వారికి మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ కేటగిరి పిల్లలకు మాత్రమే టీకాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.68 లక్షల పిల్లలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 15-18 ఏండ్ల మధ్య పిల్లలు 1.80 లక్షల మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 49 వేలు, నిర్మల్‌లో 60 వేలు, మంచిర్యాలలో 23 వేలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 36 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా రెండు డోసుల టీకా ఇవ్వాలని నిర్ణయించారు. పెద్దల్లో అయితే రెండో డోసుకు కొంత ఎక్కువ వ్యత్యాసం ఉన్నా పిల్లల్లో మాత్రం 28 రోజులకే రెండో డోస్ వేయాలని నిర్ణయించారు. అయితే పెద్దల మాదిరిగా ఎక్కడబడితే అక్కడ ఈ టీకాలు ఇవ్వడం లేదు. వైద్యులు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రధాన దవాఖానలు, ఏరియా వైద్యశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మాత్రమే పిల్లలకు టీకాలు వేస్తున్నట్లు ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
వచ్చే వారం నుంచి ప్రికాషనరీ డోస్..
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారికి కూడా ప్రికాషనరి డోసు టీకా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వచ్చే వారం నుంచి ఈ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా 60 ఏండ్లు పైబడిన వారితోపాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులకు ప్రికాషనరీ డోస్ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది జనవరి నుంచి ప్రారంభమైనట్లుగానే విడుతల వారీగా, వయసుల వారీగా ఈ ప్రికాషనరీ డోస్ టీకా ఇచ్చే అవకాశం ఉంది.