
ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన
గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు
వచ్చేనెల 8 వరకు కొనసాగనున్న కార్యక్రమం
ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపారంటున్న గిరిజనులు
పోడు రైతుల ఆనందం
ఆదిలాబాద్, నవంబర్ 8 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడుభూములకు పట్టాల పంపిణీలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం పండుగలా ప్రారంభమైంది. వచ్చేనెల 8 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా, అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు ఇదో సదావకాశంగా మారింది. మొదటి రోజు అటవీ, పంచాయతీ, రెవెన్యూ శాఖల సిబ్బంది దరఖాస్తు పత్రాలతో గ్రామాల్లో అవగాహన కల్పించగా, ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యులు వీరికి సహకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,08,959 ఎకరాల్లో పోడు వ్యవసాయం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, దరఖాస్తుల పరిశీలన అనంతరం హక్కు పత్రాలు అందించనున్నారు. ఎన్నో ఏళ్లుగా భూములకు పూర్తి హక్కులు లేక ఇబ్బందులు పడిన గిరిజనం, పట్టాల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీభూములు సాగు చేస్తున్న గిరిజనుల ఏళ్లనాటి కల నెరవేరనుంది. అటవీ భూముల్లో పంటలు పండిస్తున్న గిరిజనులకు హక్కు పత్రాల పంపిణీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. డిసెంబర్ 8 వరకు గ్రామాల్లో పోడు భూములు సాగు చేస్తున్న వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. హక్కు పత్రాల పంపిణీలో భాగంగా మొదటి రోజు గ్రామాల్లో అటవీశాఖ బీట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు పర్యటించారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యుల సమక్షంలో దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే విషయంలో అవగాహన కల్పించి, సంబంధిత పత్రాలతో క్లెయిమ్స్ స్వీకరించారు.
ఉమ్మడి జిల్లాలో లక్షా 8వేల ఎకరాలు..
ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల అటవీభూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56,140 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 19,543 ఎకరాల్లో ఆక్రమణ, మంచిర్యాల జిల్లాలో 8,276 ఎకరాల్లో పోడు వ్యవసాయం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 25 వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం సాగుతున్నట్లు నిర్ధారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీభూములు సాగు చేస్తున్న వారిని గుర్తించి పట్టాలు పంపిణీ చేయనున్నారు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే..
పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఆధార్‌నంబర్, ఫోన్ నంబర్, రేషన్‌కార్డు నంబర్, జీవిత భాగస్వామి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా, హక్కు కోరుతున్న భూమి వివరాలు, ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అర్జీదారుడి కుటుంబ సభ్యులు పేర్లు, వయస్సు, ఆధార్ నంబర్, అటవీ భూమి విస్తీర్ణం, స్వయంగా సాగులో ఉన్నది లేదా ఇతర అవసరాల కోసం వినియోగిస్తుందనే వివరాలు తెలియజేయాలి. గ్రామపెద్దల వాంగ్మూలం కాపీని సైతం జతపర్చాలి. అన్ని పత్రాలతో దరఖాస్తు చేసిన వారికి ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యులు రసీదు ఇస్తారు. ప్రభుత్వం తమకు పట్టాల పంపిణీ చేస్తుండడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నం..
మా ఊళ్లో 51 మంది పేదలు 186 ఎకరాల అటవీ భూముల్లో పంటలు సాగు చేస్తున్నరు.. 30 ఏళ్లుగా వివిధ పంటలు పండిస్తున్నరు. ఈ భూములు అటవీశా ఖకు చెందినవి కావడంతో వాటిపై ఎలాంటి హక్కులు లేవు. దీంతో అధికారులతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ భూములకు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నం. ప్రభుత్వం పట్టాల పంపిణీ ప్రారంభించడంతో ఏళ్ల కల నెరవేరనుంది.
పట్టాల కోసం ఎదురు చూస్తున్నం..
నేను కుటుంబసభ్యులతో కలిసి గ్రామంలో మూడెకరాల అటవీ భూమిని సాగు చేస్తున్న. 30 ఏళ్ల నుంచి భూమిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నం. పట్టాలు లేకపోవడంతో సర్కారు సాయం అందడం లేదు. బ్యాంకులో కూడా లోన్లు ఇవ్వడం లేదు. పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నం. మా భూమికి పట్టాలు ఇచ్చేందుకు సర్కారు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది.