
నిర్మల్ అర్బన్, నవంబర్ 8: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శాంతినగర్ కేజీబీవీలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఉన్న బాలబాలికలందరినీ కంటికి రెప్పలా కాపాడాలన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి స్రవంతి మాట్లాడుతూ.. పిల్లలకు అభివృద్ధి, రక్షణ, పాల్గొనే, జీవించే హక్కులు ఉన్నాయన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు జిల్లా వ్యాప్తంగా బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో లక్ష్యంతో బాలికల విద్య, రక్షణపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు ఎండీ వహీద్, సభ్యులు జున్ను అనిల్, శ్రీలత, సైమన్ సుందర్, స్వదేశ్, సెక్టోరియల్ అధికారి సలోమి కరుణ, సీడీపీవో నాగమణి, సూపర్వైజర్ రాజకుమారి, ఎస్వోలు సుజాత, లతాదేవి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, బాలల పరిరక్షణ అధికారి సగ్గం రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జాతీయ సాధన సర్వే పరీక్షకు ఏర్పాట్లు
జిల్లాలో జాతీయ సాధన సర్వే (ఎన్ఏఎస్) పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు అంచనా వేసేందుకు ఈ నెల 12న ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 179 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. పరిశీలకులుగా 179 మంది, ఇన్విజిలేటర్లుగా 218 మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4604 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. 3,5,8,10వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాలి
సోన్, నవంబర్ 8: బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాలని నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి పేర్కొన్నారు. బాలలను కంటికి రెప్పలా కాపాడుతూ వారి హక్కులను పరిరక్షించాలని సూచించారు. సోమవారం సోఫీనగర్ సోన్ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాల్యం అత్యంత సున్నితమైనదని, నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.