
జోరుగా వార్డు, గ్రామ కమిటీల నియామకం
ఈ నెల 12లోగా పూర్తి చేసేందుకు కసరత్తు
మండల కమిటీలకు సన్నద్ధమవుతున్న పార్టీ
సెగ్మెంట్లలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశాలు
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం
ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామ, మున్సిపల్, వార్డు కమిటీలు వేస్తుండడంతో జోష్ కనిపిస్తున్నది. 12వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులు పదవుల కోసం పోటీ పడుతుండగా.. సీనియర్ నాయకులు సమన్వయంతో ఏకగ్రీవం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో టీఆర్ఎస్ గ్రామ, పట్టణ, మండల కమిటీల ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ పర్యటించి నాయకులతో చర్చించారు. మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తోపాటు ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్యలతో కలిసి శిశు, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశాలు నిర్వహించారు. గ్రామ కమిటీల ప్రక్రియ చివరి దశకు చేరుకోగా, మండల కమిటీల ఏర్పాటుకు కూడా పార్టీ సిద్ధమవుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. ఈ నెల 12 లోగా గ్రామ, మున్సిపల్, వార్డు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాల్లోని టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వివిధ పదవులు కోసం పట్టణాలు, గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ గ్రామ, పట్టణ, మండల కమిటీల ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కమిటీలు ఎలా ఏర్పాటు చేయాలనే విషయాలను తెలియజేశారు. కమిటీల ఏర్పాటుకు పలు సూచనలు చేశారు. ఇన్చార్జీల సలహాలు, సూచనల మేరకు నాయకులు గ్రామాల్లో కమిటీలు నియమిస్తున్నారు.
తీవ్ర పోటీ..
టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలకు తీవ్రపోటీ నెలకుంది. పార్టీ నియమావళి ప్రకారం కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 51 శాతానికిపైగా ప్రాతినిధ్యం ఉండాలనే సూచనలతో ఎన్నికల ప్రక్రియ చూస్తున్న నాయకులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. కమిటీల ఏర్పాటు సవ్యంగా జరిగేలా అందరితో చర్చించి ఏకాభిప్రాయంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు కమిటీల ఏర్పాటును పర్యవేక్షిస్తూ ఎన్నికైన వారికి అభినందనలు తెలుపుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 60 శాతానికి పైగా కమిటీల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 165 గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 103 కమిటీల నియామకం పూర్తయ్యింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను 28 కమిటీల నియామకం జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 34 గ్రామ పంచాయతీలకు గానూ 25 పంచాయతీల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. బేల మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉండగా 27 పంచాయతీల్లో, జైనథ్ మండలంలో 42 పంచాయతీలు ఉండగా 20 పంచాయతీల్లో మావల మండలంలో 3 గ్రామ పంచాయతీలు ఉండగా 3 పంచాయతీల్లో కమిటీల నియామకం పూర్తయింది. బోథ్ నియోజకవర్గంలో 229 గ్రామ పంచాయతీల్లో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 130 పంచాయతీల్లో కమిటీలను నియమించారు.
నిర్మల్ జిల్లాలో
నిర్మల్ మున్సిపాలిటీలో 41 వార్డులు ఉండగా 21 వార్డుల్లో కమిటీల ఏర్పాటు పూర్తయింది. నియోజవర్గంలోని దిలావర్పూర్ మండలంలో 12 పంచాయతీలకు 8 పంచాయతీల్లో గ్రామ కమిటీలు, సారంగాపూర్ మండలంలో 32 పంచాయతీలు ఉండగా 22 పంచాయతీల్లో, లక్ష్మణచాందా మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గానూ 15 పంచాయతీల్లో, నిర్మల్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా 8 పంచాయతీల్లో కమిటీల నియామతం పూర్తయింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఒక వార్డు కమిటీ ఎన్నిక జరగింది. ఖానాపూర్ రూరల్ మండలంలో 24 పంచాయతీలు ఉండగా 8 పంచాయతీల్లో, కడెం మండలంలో 28 పంచాయతీలు గానూ 10 పంచాయతీల్లో, దస్తురాబాద్ మండలంలో 14 పంచాయతీలు ఉండగా 13 పంచాయతీల్లో, పెంబి మండలంలో 24 పంచాయతీలకు గానూ 6 పంచాయతీల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ మండలంలో 37 పంచాయతీలకు గానూ 27 గ్రామాల్లో, జన్నారం మండలంలో 29 పంచాయతీలకుగాను 20 గ్రామాల్లో, ఇంద్రవెల్లి మండలంలో 28 పంచాయతీలకు గాను 4 గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల నియామకం పూర్తయ్యింది. మథోల్ నియోజకవర్గంలోని 206 గ్రామ, పట్టణ కమిటీల్లో 161 ఎన్ని కలు పూర్తయ్యాయి. భైంసా మున్సిపాలిటీ లో 26 వార్డులకు గాను 12 వార్డుల్లో నియామకం పూర్తయ్యింది. కుభీర్ మండలంలో 41 పంచాయతీలు ఉండగా 41 గ్రామాల్లో , తానూర్ మండలంలో 33 పంచాయతీలు ఉండగా 33 గ్రామాల్లో, భైంసా రూరల్ మండలంలో 30 పంచాయ తీలు ఉండగా 20 గ్రామాల్లో, బాసర మం డలంలో 10 పంచాయతీలకు గాను 8 గ్రా మాల్లో, మథోల్ మండలంలో 19 పంచా యతీలకు 12 గ్రామాల్లో , లోకేశ్వరం మం డలంలో 25 పంచాయతీలు ఉండగా 16 గ్రామాల్లో, కుంటాల మండలంలో 15 పంచాయతీలకు 15 గ్రామాల్లో, నర్సాపూర్ (జీ) మండలంలో 7 పంచాయతీలకు గానూ 4 గ్రామాల్లో కమిటీల నియామకం పూర్తిచేశారు.
మంచిర్యాల జిల్లాలో
మంచిర్యాల నియోజకవర్గంలో 66 గ్రామ పంచాయతీలకు గానూ 52 పంచాయతీల్లో కమిటీల నియామకం పూర్తి చేశారు. 76 వార్డులకు గానూ 56 వార్డు కమిటీల ఎన్నికలు జరిగాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో 114 గ్రామ పంచాయతీలకు గానూ 85 పంచాయతీల్లో కమిటీలను ఏర్పాటు చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 193 పంచాయతీలకు గాను 53 గ్రామ కమిటీలు పూర్తయ్యాయి. సిర్పూర్ నియోజకవర్గంలో 142 పంచాయతీలకు గాను 46 కమిటీలు ఏర్పాటయ్యాయి.
..