
కడెం, సెప్టెంబర్ 8: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కడెం జలాశయానికి వరద చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 697.125 అడుగులు (6.874టీఎంసీల) ఉంది. కాగా, బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 20,053 క్యూసెక్కుల వరద రావడంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి 18,353 క్యూసెక్కులు దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు నీటి విడుదలను నిలిపి ప్రధాన కాలువ ద్వారా 356 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్వర్ణ, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల వరదగేట్లు ఎత్తడంతో బెల్లాల్ గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంటపొలాలు నీట మునిగాయి.
సదర్మాట్ నీటి మట్టం 12 అడుగులు
ఖానాపూర్రూరల్, సెప్టెంబర్ 8 : సదర్మాట్ నీటి మట్టం 12 అడగులు మించి ఉపరితలాన్ని తాకింది. రాతి గోడపై నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు జేఈ ఉదయ్ కుమార్ తెలిపారు. ఇది వరకు ఎప్పుడూ లేనంతగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఎస్సారెస్పీ అధికారులు గోదావరి పరీహవాక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
నీటమునిగిన పంటలు
లక్ష్మణచాంద, సెప్టెంబర్ 8 : గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండడంతో మండలంలోని పీచర, ధర్మారం, మునిపెల్లి, పార్పెల్లి, చింతల్చాంద శివార్లలో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.గోదావరి సమీపంలో రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. వెయ్యికి పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పీచర క్లస్టర్ పరిదిలో 200 ఎకరాల్లో మక్క, 100 ఎకరాల్లో పసుపు, 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు అంచనా వేశారు. కనకాపూర్ పరిధిలో 15 ఎకరాల్లో మక్క, 15 ఎకరాల్లో పసుపు, 10 ఎకరాల్లో వరి, లక్ష్మణచాంద క్లస్టర్లో 220 ఎకరాల్లో మక్క, పసుపు 100 ఎకరాలు, వరి 190 ఎకరాలు, సోయాబీన్ 60 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఏవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.
దెబ్బతిన్న రోడ్లు
సిరికొండ, సెప్టెంబర్ 8: మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు మండలంలోని వాయిపేట్, పాండుగూడ, తుమ్మల పాడు, కుంటగూడ, రాంపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి. వాయిపేట్,కుంటగూడలో పత్తి,సోయా, మక్కజొన్న పంటలు నేలవాలాయి. దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు సర్వే చేయాలని కుంటగూడ సర్పంచ్ గంగాధర్ కోరారు.
పంటల పరిశీలన
దస్తురాబాద్, సెప్టెంబర్ 8 : మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలు దేవునిగూడెం, భూత్కూర్, రాంపూర్, మున్యాల, గొడిసేర్యాల, గొడిసేర్యాల గోండు గూడెం, బుట్టాపూర్లోని పంటలు నీటమునిగాయి. భూత్కూర్ శివారులో నీట మునిగిన పంటలు, విద్యుత్ స్తంభాలను ఎంపీపీ సింగరి కిషన్ రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. పంట నష్టాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్ఐలు గంగన్న, పీవీ నర్సయ్య, రైతులు ఉన్నారు.