
వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు
సీసీ పుటేజీల ఆధారంగా గుర్తింపు
మెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్గేట్ వద్ద పట్టివేత
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
ఐదుగురు నిందుతులపై కేసు
రియల్ ఎస్టేట్‌లో విభేదాలే కారణం
నిర్మల్ అర్బన్, ఆగస్టు 8 : నిర్మల్‌లో రియల్ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దివ్యానగర్ తన్వి అపార్ట్మెంట్లో విజయ్ చందర్ దేశ్‌పాండే తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లలో అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. లిఫ్ట్ ద్వారా ఇంట్లోకి చొరబడి విజయ్ చందర్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు వారిని బెదిరింపులకు గురి చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి స్థానికులు తెలిపిన వివరాలతో వాహనాల తనిఖీ చేపట్టారు. గంజాల్ టోల్ ప్లాజా వద్ద కిడ్నాప్‌కు సంబంధించిన వాహనాల వివరాలను గుర్తించారు. టోల్‌ప్లాజాలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆమార్గంలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వాహనం పట్టుబడగా, మరో వాహనాన్ని తుఫ్రాన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వెంటనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. విజయ్ చందర్ తండ్రి రాఘవేందర్ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ చందర్ దేశ్‌పాండే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన విభేదాల కారణంగా కిడ్నాప్‌కు గురికాగా… ఐదుగురు నిందితులను తుఫ్రాన్ వద్ద పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఇందులో కృష్ణారావు, గాన్ని కృష్ణ, సయ్యద్ అబ్దుల్ ఖాదర్, యూసుఫ్ సయ్యద్, మహ్మద్ అబ్బాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.