
జావెలిన్ త్రోలో రాణిస్తున్న యువకుడు
జాతీయ స్థాయిలో పతకాలు
ప్రోత్సాహం అందిస్తే మరింత ముందుకు..
కోటపల్లి, ఆగస్టు 8 : టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో యువ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం పతకం సాధించగా, ప్రస్తుతం ఈ క్రీడ తెరపైకి వచ్చింది. మారుమూల గ్రామాల నుంచి కూడా జావెలిన్ త్రోలో జాతీయస్థాయి వరకు వెళ్లిన క్రీడాకారులు ఉన్నారు. అందులో ఆర్థికంగా లేకున్నప్పటికీ పట్టుదలతో జాతీయ స్థాయికి వెళ్లి ముందుకు సాగుతున్న దుర్గం శ్రీకాంత్ పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం మల్లేశ్-చిన్నక్కల కుమారుడు శ్రీకాంత్‌కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాలలో విద్యనభ్యసిస్తూనే ఖాళీ సమయంలో జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో శ్రీకాంత్ ఆసక్తిని గుర్తించిన పాఠశాల పీడీ సిరంగి గోపాల్ ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. క్రీడల సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అప్పు చేసి పోటీలకు వెళ్లేవాడు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ జావెలిన్‌త్రో విభాగంలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగిన పోటీల్లో నాలుగో స్థానం, ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లో ఆరో స్థానం, ఫూణెలో జరిగిన పోటీలో మూడో స్థానం సాధించాడు. అలాగే రాష్ట్ర స్థాయిలో మొత్తం 8 పతకాలను సాధించగా, అందులో మూడు స్వర్ణాలతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇతని ప్రతిభను గుర్తించిన అధికారులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మండల స్థాయిలో ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తించి సన్మానం చేసి ప్రశంసా పత్రం, జ్ఞాపికతో పాటు రూ.10,116 నగదును అందజేశారు. పదవతరగతి వరకు కోటపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన శ్రీకాంత్ ఇంటర్ పూర్తి చేసి డిపెడ్ చదువుతున్నాడు.
ప్రోత్సాహం అందించాలి : దుర్గం శ్రీకాంత్
ప్రోత్సాహం అందిస్తే జావెలిన్ త్రో విభాగంలో మరిన్ని అద్భుతాలు సాధిస్తా. ప్రతిభా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో కొన్నిసార్లు పోటీలకు వెళ్లలేదు. గ్రామాల్లో ని నిరుపేద క్రీడాకారులకు గుర్తించి వారికి తగిన శిక్షణ ఇస్తే బాగుంటుంది. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా దేశానికి స్వర్ణాన్ని అందించడం చాలా ఆనందంగా ఉంది.