
విద్యానగర్(కరీంనగర్), ఆగస్టు 8 : వైద్యులు విలువలతో కూడిన వైద్యం అందించాలని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్, ఐఎంఏ జాతీయ ఎలెక్ట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చాలా మంది అనర్హులు వైద్య వృత్తిలో కొనసాగుతున్నారని, ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా మందులు రాస్తే చట్టపరంగా శిక్ష పడే వరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశ్రమించదని హెచ్చరించారు. ఈ విషయంపై ఐఎంఏ సీరియస్‌గా వ్యవహరించాలని కోరారు. కరీంనగర్‌లోని శ్వేత కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాలుగో జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యులు శాస్త్ర విజ్ఞానాన్ని అందింపుచ్చుకోవాలన్నారు. కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారన్నారు. ఫస్ట్‌వేవ్‌లో దేశవ్యాప్తంగా 750 మంది, సెకండ్‌వేవ్‌లో 700 మంది వైద్యులు కరోనా రోగులకు వైద్యం అందిస్తూ మృత్యు వాతపడడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని 350 మంది వైద్యులు, సిబ్బంది కరోనాకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిబంధనలు పాటించకపోతే థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ భయపడ్డారన్నారు. దీంతో అధిక వేతనాలు ఇచ్చి సేవలందించాల్సి వచ్చిందన్నారు. ఈ కారణంగానే కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ల నుంచి ఫీజుల రూపంలో కొంత మేరకు ఎక్కువగా డబ్బులు వసూలు చేసిన మాట నిజమేనన్నారు. రోగులు కోలుకున్న తర్వాత ఫీజులు చెల్లించకుండా వెళ్లలేదని, తమ స్తోమతకు తగ్గట్టుగా ఫీజులు చెల్లించారని చెప్పారు. డాక్టర్లకు మానవత్వం ఉన్నందు వల్లే పేదలకు వైద్యం అందుతుందన్నారు. వైద్యరంగాన్ని ఫోరం నుంచి మినహాయించడం సంతోషకరమన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వైద్యుల సంరక్షణ, సమస్యల పరిష్కారానికి ఐఎంఏ కృషి చేస్తున్నదని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్‌రెడ్డి తెలిపారు. వైద్యులు తమ సేవలను పట్టణాలకే పరిమితం చేయయకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు కోరారు. కార్యక్రమంలో ఐఎంఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి కిషన్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్‌రెడ్డి, ఐఎంఎ ఎలెక్ట్ ప్రెసిడెంట్ బీఎన్‌రావు, ఐఎంఎ బాధ్యులు ఎం సంపత్‌రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వసంత్‌రావు,కార్యదర్శి డాక్టర్ రాంకిరణ్, వైద్యులు శ్రీనివాస్, విజయలక్ష్మి, సుధీప్, సముద్రాల శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, విశాల్, సురేంద్రనాథ్, భూంరెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.