
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 8 : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని స్టేడియంలో సుమారు రూ.10 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతానికి భిన్నంగా ఈసారి ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ మున్సిపల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నుంచి కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించడానికి కృషి చేస్తామన్నారు. స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికల ద్వారా ముందుకు సాగుతున్నామన్నారు. అందులో భాగంగా హాకీ మైదానానికి రూ.5.20లక్షలు, కబడ్డీ కోర్టు నిర్మాణం కోసం రూ.5.20లక్షలు, స్పోర్ట్స్ స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం మరో రూ.5 లక్షల నిధులను గతంలోనే మంజూరు చేశామని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తాయన్నారు. స్టేడియానికి కేటాయించిన నిధుల్లో రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. కొందరు బీజేపీ నాయకులు అవకతవకలు జరిగాయనడంలో వాస్తవం లేదని, ఎంపీ నిధుల నుంచి కూడా స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించేలా చూడాలని సూచించారు. స్టేడియంలో క్రీడాకారుల అభివృద్ధి కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు స్టేడయం అభివృద్ధికి సుమారు రూ.52 లక్షల నిధులు కేటాయించామని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని మైదానాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు శ్రీలత, లక్ష్మణ్, ప్రకాశ్, అజయ్, బండారి సతీశ్, జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి పార్థసారథి, జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి చరణ్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.