
ఆపరేషన్ చేయాలంటే రూ.10 లక్షల ఖర్చు
‘లూపస్’ వ్యాధితో ఏడాదిగా మంచానికే పరిమితం
జీవచ్ఛవంలా మారిన వైనం
పనులు మానేసి బిడ్డను టికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
కౌటాల, ఆగస్టు 8 : కూలీ పనులు చేసుకుం టూ ఉన్న ఎకరం భూమిలో పంట పండించి తిని జీవించే కుటుంబం వారిది. నలుగురు సంతానం కాగా, అందులోనూ ముగ్గురు ఆడపిల్లలు.. వారి ని సాదుకుంటూ ఉన్నదాంట్లో సరిపెట్టుకుంటున్నారు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంలో కి మాయదారి ఆపద వచ్చిపడింది. రెండో కూతు రు ‘లూపస్’ వ్యాధితో ఏడాదికాలంగా మంచానికే పరిమితమైంది.. రూ.10 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయిస్తే పూర్తిగా నయమవుతుంది. ఇప్పు డు శిరీష పరిస్థితి మరింత దయనీయంగా మారిం ది. చికిత్స కోసం దాతల సహాయం కోసం ఆ కు టుంబం ఎదురుచూస్తున్నది. దాతలు 86869 00800 (సంతోష్) నంబర్‌కు యూపీఐ, గూగుల్‌పే, పోన్‌పే ద్వారా డబ్బులు పంపించవచ్చని వేడుకుంటున్నది.
మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన గాడి దుర్గయ్య-చంద్రకళ దంపతులకు నలుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. నలుగురు పిల్లలను సాదుకుంటూ ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. సంతోషంగా ఉంటున్న ఆ కుటుంబంలోకి మాయదారి రోగం ప్రవేశించింది. రెండో కుమార్తె శిరీషకు ‘లూపస్’ అనే వ్యాధి సోకింది. ఇంటర్ చదువుతూ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా భవిష్యత్‌లో సేవ చేయాలని కలలు కన్న శిరీషకు ‘లూపస్’ వ్యాధి సోకడంతో జీవచ్ఛవంలా మారింది. కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. ఆమె పరిస్థితి హృదయవిదారకంగా మారింది.
చికిత్స కోసం అప్పులు..
కౌటాల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివే సమయంలో ఆమెకు జ్వరం వచ్చింది. అప్పుడు వారి తల్లిదండ్రులు స్థానికంగా చికిత్స చేయించారు. ఆ తర్వాత ఆమెకు కొద్ది రోజుల్లోనే వెంట్రుకలు ఊడిపోవడం, చర్మంపై పుండ్లు కావడం, మోకాళ్లు, మోచేతులు, వీపు భాగం ఎర్రబారిపోయి చూస్తే భయానకంగా తయారైంది. ఈమెకు వ్యాధి సోకకముందే తండ్రి దుర్గయ్యకు గుండె సంబంధిత వ్యాధి రావడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినప్పటికీ కన్న కూతురు పరిస్థితి చూడలేక రూ.50వేలు అప్పు చేసి కరీంనగర్, హైదరాబాద్ దవాఖానలకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ ఏ డాది మార్చిలో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చూపించగా.. ‘లూపస్’ వ్యాధి సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇప్పుడు శిరీష పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మంచం దిగి కింద అడు గు పెట్టలేని స్థితిలో ఉంది. శరీరమంతా పుండ్లు, నొప్పులుండడం.. కనీసం తిండి తినలేని స్థితికి చేరింది.
కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులు..
శిరీషను తల్లిదండ్రులు అన్ని పనులు మాని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రోజురోజుకూ పరిస్థితి దిగజారడంతో కన్న కూతురు తమకు దక్కుతుందో లేదోనని ఆ పేద తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వ్యాధి పూర్తి చికిత్స కోసం రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమ కూతురు ప్రాణాలను కాపాడేందుకు పెద్ద మనస్సుతో ప్రభుత్వం, దాతలు ముందుకురావాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం శిరీష హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నది. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన ‘పీపుల్ చిల్డ్రన్స్’ స్వచ్ఛంద సంస్థ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న శిరీషను కలిసి ఆమెకు రూ.50 వేల నగదును అందించారు. దాతల సహకారంతో ఆమె చికిత్స పూర్తి అయ్యేలా చూస్తామని స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 86869 00800 (సంతోష్) నంబర్‌కు యూపీఐ, గూగుల్‌పే, పోన్‌పే ద్వారా డబ్బులు పంపించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.