
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
రణదివేనగర్లో కబడ్డీ పోటీలు
అవల్పూర్లో ముగిసిన బాజీరావు బాబా సప్తాహం
ఆదిలాబాద్ రూరల్, జనవరి 8 : క్రీడల్లో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుం దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని రణదివేనగర్లో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. క్రీడలతో విద్యార్థులు క్రమశిక్షణతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. దీంతో సమాజంలో మనం ఎలా ఉండాలనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. నలుగురితో స్నేహపూర్వకంగా ఉండవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శైలేందర్, మహేందర్, నారాయణ, నవీన్, పురుషోత్తం, పర్వీన్ సుల్తానా పాల్గొన్నారు.
నూతన తరగతి గదులు ప్రారంభం..
మావలలోని జడ్పీ హైస్కూల్లో నూతన తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సుమారు 700 గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఆర్టీయూ తెలంగాణ క్యాలెండర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జీవోఎంఎస్ నంబర్ 317 ప్రకారం మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వీ సత్యనారాయణ, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు సంద అశోక్, నాయకులు సునీల్చౌహాన్, ఆడే నూర్సింగ్, తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అవల్పూర్లో ముగిసిన సప్తాహం..
బేల, జవనరి 8 : బేల మండలంలోని అవల్పూర్లో వారం నుంచి కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహం వేడుకలు శనివారంతో ముగిశాయి. ఎమ్మెల్యే జోగు రామన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ప్రతీ పండగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే గ్రామాల్లో సంత్బాబా ఆలయాలు, బేల మండల కేంద్రంలో రూ.60 లక్షలతో రాం మందిరం నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. అంతకుముందు బాబా భక్తులు ఆలయంలో పూజలు నిర్వహించి, భజన సంకీర్తనాలతో గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయం వద్ద మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకులు పాయల్ శంకర్, సుహాసిని, అడ్డి భోజారెడ్డి, గంభీర్ ఠాక్రె, సతీశ్ పవార్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ప్రమోద్ రెడ్డి, తల్లోల్ల చంద్రయ్య, తన్వీర్ ఖాన్, వాడ్కర్ తేజ్రావు, ఖోడే విపిన్, సుధాం రెడ్డి, ఎంపీటీసీ నగేశ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మినక పుష్పలత, ఆయా గ్రామాల సర్పంచ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.