
ఇంటి నుంచి వెళ్లిపోయిన జంట
గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య
భైంసా పట్టణంలో విషాదం
భైంసా, జనవరి 8 : ఇద్దరికీ వివాహమైంది.. ఒకరికి గతంలో పెళ్లయి విడాకులయ్యాయి.. ఇద్దరిదీ పక్కపక్క కాలనీలే.. వీరి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది.. ఇద్దరూ కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు.. కానీ పెద్దలు ఒప్పుకుంటారోలేదోనని మదనపడ్డారు. చివరకు కలిసి ఉండకపోయినా.. కలిసే‘పోదాం’ అనుకున్నారు. గడ్డెన్నవాగులో దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భైంసా పట్టణంలోని రాహుల్‌నగర్‌కు చెందిన గోపాల్ (25) డబ్బాలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఇతడికి ఏడాదిన్నర క్రితం అదే కాలనీకి చెందిన సోనితో వివాహమైంది. దాని పక్కనే ఉన్న ఏపీ నగర్‌కు చెందిన ఏ సునీత(19)కు గతంలో వివాహమై, విడాకులయ్యాయి. ఈ క్రమంలో గోపాల్, సునీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. ఇదివరకే ఇద్దరికీ పెళ్లి కావడంతో తమ ప్రేమను ఇరు కుటుంబాల్లో ఒప్పుకోరని భావించారు. కలిసి ఉండకపోయినా ఇద్దరం కలిసి చావాలని అనుకున్నారు. ఈ క్రమంలో తమ ఇండ్ల నుంచి మంగళవారం చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. కాగా.. శనివారం ఉదయం గడ్డెన్నవాగు ప్రాజెక్టులో రెండు మృతదేహాలు తేలియాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.