
నిర్మల్, భూపాలపల్లి పరిధిలోకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
జోనల్‌కు అనుకూలంగా పని విభజన ఖరారు చేస్తూ సర్కారు ఉత్తర్వులు
మంచిర్యాలకు తరలిన కవ్వాల్ టైగర్ జోన్
నిర్మల్ టౌన్, జనవరి 8 : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు కొత్త జోన్లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అటవీశాఖలో కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో ఆదిలాబాద్‌లో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేయగా.. నిర్మల్, మంచిర్యాలను ఒక సర్కిల్‌కు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మరో సర్కిల్‌గా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 2018లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించింది. ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా డివిజన్లలో పని చేస్తున్న అటవీశాఖ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టిన ప్రభుత్వం.. పని విభజన కోసం కొత్త సర్కిళ్లనూ మార్చింది. గతంలో నిర్మల్ సర్కిల్లో నిర్మల్, ఖానాపూర్, జన్నారం, మంచిర్యాల, బెల్లంపల్లితో పాటు కవ్వాల్ అభయారణ్యం ఉండగా.. ఆదిలాబాద్ సర్కిల్లో ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఉన్నాయి. ప్రస్తుతం సర్కిళ్ల విభజన నిర్వహించగా.. నిర్మల్ కేంద్రంగా నిర్వహించబడుతున్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ కార్యాలయాన్ని మంచిర్యాలకు కేటాయించారు. కొత్త జోన్ల ప్రకారం.. కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నిర్మల్ కేంద్రంలోనే బాసర జోన్ సర్కిల్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలను చేర్చగా.. కాళేశ్వరం జోన్ పరిధిలో గల భూపాలపల్లిని కొత్త అటవీశాఖ సర్కిల్‌గా మార్చారు. ఇందులో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాలను చేర్చారు. ఇక నుంచి నిర్మల్ కేంద్రంగానే బాసర జోన్ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల అటవీశాఖ కార్యాలయాలకు సంబంధించిన అన్ని పనులు కొనసాగుతుండడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తుండడంతో కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయడంతో ఆయా జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆ సర్కిల్ పరిధిలోకి రానున్నారు.