
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రంలో నేటి నుంచి జాతర
ఏడు రోజుల పాటు నిర్వహణ
11న గురుకృపా దివస్
పలు రాష్ర్టాల నుంచి తరలిరానున్న లంబాడాలు
కొవిడ్ నిబంధనలు అమలు
నార్నూర్, జనవరి 8 : ఉమ్మడి జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)లోని బంజారా దీక్షభూమి ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది. ఇక్కడ కొలువుదీరిన జగదాంబాదేవి, రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వీ ధర్మగురువు రామారావ్ మహారాజ్ ఆలయాన్ని ముస్తాబు చేశారు. దీక్షగురువు శ్రీసంత్ ప్రేమ్‌సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జనవరి 11న గురు, శిష్యుల మిలన్ (దీక్షాదివస్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. లంబాడాల కులదైవమైన జగదాంబాదేవి, రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వీ, ధర్మ గురువు శ్రీరామారావ్ మహారాజ్ ప్రత్యేక పూజలు చేసి ఉదయం 11 గంటలకు భోగ్‌భండార్ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. శ్రీసేవాలాల్ మహారాజ్ పల్లకీని గంగాపూర్ (తండా) నుంచి వైభవంగా శోభాయాత్రగా కలినడకన దీక్షభూమికి చేరుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ర్టాల భక్తులు తరలివస్తారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. దీక్షభూమిలో భజన, కీర్తనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది. ఆదివారం నుంచి జారత ప్రారంభ కానుండగా.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
దీక్షభూమి ఉద్దేశం..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం శంకర్‌లొద్దిలో 1978లో దీక్ష గురువు శ్రీసంత్ ప్రేమ్‌సింగ్ మహారాజ్ తపస్సు చేశారు. జనవరి 11, 1979న మహారాష్ట్రలోని పౌరదే వి నుంచి ధర్మగురువు రాష్ట్రీయ సంత్మహాన్ తపస్వీ రామారా వ్ మహారాజ్ శంకర్‌లొద్దికి వెళ్లారు. ప్రేమ్సింగ్కి మహారాజ్ ఉ పదేశించారు. సమాజ జాగృతం కోసం తండాతండా వెళ్తూ ధర్మ ప్రచారం చేయమని ఆదేశించారు. అప్పటి నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గోవా.. ఇలా ప్రతి రాష్ట్రంలో ధర్మ ప్రచారం చేస్తున్నారు. 1988లో శంకర్ లొద్ది గ్రామంలో శివయజ్ఞం, 1992లో కొత్తపల్లి(హెచ్)లోని ప్రేమ్‌సింగ్ మహారాజ్ ఆలయం వద్ద లక్ష్య చండీయజ్ఞాన్ని నిర్వహించారు. నాటి నుంచి ప్రతి ఏటా జాతీయ బంజారాల దీక్షభూమి వద్ద గురు, శిష్యుల (మిలాన్ దివస్), 11న (గురుకృపా దివస్)ను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తారు.
సామాజిక చైతన్యంపై హితబోధ..
జనవరి 11న భక్తులు ఇతర రాష్ర్టాల నుంచి బంజారా దీక్షభూమికి తరలివస్తారు. పూజా, భోగ్‌భండార్ ముందు భక్తులనుద్దేశించి దీక్షగురువు ప్రేమ్‌సింగ్ మహారాజ్ సామాజిక అంశాలపై చైతన్య పరుస్తారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పానీయాలు సేవించ వద్దని, వాటితో కలిగే అనర్థాలను వివరిస్తారు. బాల్యవివాహాలు, వరకట్నం తదితర అంశాలపై భక్తులకు బోధిస్తారు.
ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత..
ప్రతి ఏటా జనవరిలో గురుశిష్యుల (మిలన్ దివస్)ను నిర్వహిస్తాం. సమాజ చైతన్యం కోసం ఆధ్యాత్మికతపై చైతన్య పరుస్తాం. నేటితరానికి సంస్కృతీ సంప్రదాయాలతో పాటు సన్మార్గాన్ని సూచిస్తాం. శాంతి, అహింసతో ఏదైనా సాధ్యమవుతుంది. దీక్షభూమికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలి.