
ప్రైవేట్ పాఠశాలకు దీటుగా లోడ్పల్లి మోడల్ స్కూల్
25 నుంచి 205 మందికి చేరిన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వం కల్పిస్తున్న వసతులే కారణం
ఆధునిక హంగులు, డిజిటల్ తరగతులు
పిల్లలను పంపేందుకు మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు
పెంచికల్పేట్, డిసెంబర్ 7: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఐటీడీఏ పరిధిలోని కొన్ని పాఠశాలలను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంగా మార్చింది. టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలను దిశ మోడల్ స్కూల్‌గా పేరు మార్చింది. పిల్లలను ఆకట్టుకునేలా పాఠశాలను తీర్చిదిద్దింది. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో కోయచిచ్చాల, లోడ్పల్లి పాఠశాలలను ఎంపిక చేసింది. కాగా, లోడ్పల్లి దిశ మోడల్ స్కూల్ ఈ ప్రాంత విద్యార్థులకు వరంలా మారింది. 1 నుంచి 3వ తరగతి వరకు కొనసాగుతున్న పాఠశాలను 5వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. కాగా, 25 మందితో ఉన్న పాఠశాల ప్రస్తుతం 205 మంది విద్యార్థులకు చేరింది. రంగురంగుల బొమ్మలతో తీర్చిదిద్దిన తరగతి గదులు, సబ్జెక్టులకు సంబంధించిన పలు అంశాల్లో ఇట్టే తెలిసేలా వేసిన చిత్రాలతో ఉన్న గదులు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ తరగతులను కూడా ఈ పాఠశాలల్లో బోధిస్తున్నారు.
ఆహ్లాదం.. ఆటలు
విద్యార్థులకు చదువుతో పాటు మానసికోల్లాసం కలిగించేలా వ్యాయామం చేయిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఊయలలు, జారుడు బల్లలు, జంపింగ్ కిట్లు, ఇతర సామగ్రిని ఏర్పాటు చేశారు. సాయంత్రం పిల్లలు ఆడుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం పాఠశాల ఆవరణలో కనిపిస్తున్నది. దిశ మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దడంతోనే పాఠశాల రూపురేఖలు మారిపోయాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదరించడం సంతోషం
ఏడాది క్రితం వరకు ఐటీడీఏ పరిధిలో టీడబ్ల్యూపీఎస్ పాఠశాల కొనసాగేది. అప్పుడు 15 నుంచి 25 మంది పిల్లలు వచ్చేవారు. ప్రస్తుతం దిశ మోడల్ స్కూల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా మార్చేసరికి రూపు మారింది. పిల్లల తల్లిదండ్రులు మా పాఠశాలను ఆదరించడం సంతోషంగా ఉంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలు ఇక్కడికి వస్తున్నరు. విద్యార్థులకు మంచి విద్యనందించడమే మా లక్ష్యం. – భగవంత్‌రావు, దిశ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు
ఫీజుల బాధలు తప్పాయి
మా అమ్మానాన్న వ్యవసా యం చేస్తుంటారు. ప్రైవేట్ లో చదివియాలంటే బోలె డు ఫీజులు కట్టాలి. ఇప్పు డు మా ఊళ్లనే సర్కారు బడిలో ఇంగ్లిష్ మీడియం స్టార్ట్ చేసిన్రు. దిశ మోడల్ స్కూల్ మంచిగున్నది. ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడనే అన్ని చెబుతున్నరు.
– అనూష, విద్యార్థిని, ఐదో తరగతి